దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో మళ్లీ బాదుడు మొదలైంది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం... జూన్ 3 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు...నిర్వహణ సంస్థ ఐఆర్బీ ప్రకటించింది.
ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వుల మేరకు టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (నేటి అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుములు పెంచుతుండగా ఈసారి లోక్‌సభ ఎన్నికల కారణంగా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియడంతో టోల్ ధరల పెంపునకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) ప్రకటించింది.
హైదరాబాద్-విజయవాడ హైవే
హైదరాబాద్-విజయవాడ (NH no.65) జాతీయ రహదారిపై...తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా రూ.35, భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా రూ.50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. స్థానికులకు నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340కి పెంచినట్లు పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ పై టోల్ వివరాలు - ప్రతి కి.మీకి రేటు(రూపాయల్లో)
- కారు/జీపు/వ్యాను/ఎల్ఎమ్వీ/ఎస్యూవీ/ఎమ్పీవీ - రూ.2.34
- ఎల్సీవీ/మిని బస్ -రూ.3.77
- బస్/2 యాగ్జిల్ ట్రక్- రూ.6.69
- 3 యాగ్జిల్ వాణిజ్య వాహనం - రూ.8.63
- భారీ నిర్మాణ మెషినరీ/ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్/4,5,6 యాగ్జిల్ ట్రక్కులు -రూ.12.40
- ఓవర్ సైజ్డ్ వాహనాలు(7 లేదా అంతకంటే ఎక్కువ యాగ్జిల్స్) - రూ.15.09
కొత్త ఛార్జీలపై అవగాహనకు టోల్ ప్లాజా వద్ద బోర్డులు ఏర్పాటు చేసినట్లు నిర్వహణ సంస్థ తెలిపింది. వాహనదారులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. కొత్త టోల్ రేట్లు, రోజు వారీ పాసులు, నెలవారీ పాసులు కోసం హెచ్.ఎం.డి.ఎ వెబ్ సైట్ https://www.hmda.gov.in/ ను సందర్శించండి.
గ్రేటర్ పరిధిలో 2 లేన్ల సర్వీస్ రోడ్లతో 158 కి.మీ పొడవు, 8 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్ర్ ప్రెస్ వే తో కలిసి ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ పై ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే సంస్థ గత ఏడాది నుంచి టోల్ రుసుములు వసూలు చేస్తుంది. జూన్ 3 నుంచి ఓఆర్ఆర్ పై టోల్ రుసుములు 2024–-25 టోల్ నిబంధనల ప్రకారం పెంచుతున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుములు మార్పులు చేస్తుంటారు.
ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. చివరి విడత పోలింగ్ జూన్ 1న ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.