ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆమెకు పెళ్లైన ఐదేళ్లకు నలుగురు పిల్లలు పుట్టడం విశేషం. ఇందులో ఇద్దరు మగపిల్లలు కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లితో పాటుగా నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వజీర్‌పురా ప్రాంతానికి చెందిన కిరణ్ కన్వర్, మోహన్ సింగ్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి అయినా సంతానం కలగలేదు. దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడి సూచనలతో 8 నెలల క్రితం కిరణ్ కన్వర్ గర్భం దాల్చింది. అయితే 2023 ఆగస్టు 26న శనివారం రాత్రి కిరణ్ కన్వర్ పురిటి నొప్పులు రావడం వల్ల ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు.
ఆదివారం ఉదయం మహిళకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు వైద్యులు. నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండగా.. ఒక్కరు మాత్రం తల్లి వద్ద ఉన్నారు. అయితే ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని డాక్టర్లు చెబుతున్నారు.
