చేన్లనే వదిలేసిన్రు..మార్కెట్ లో ఒక్కసారిగా పడిపోయిన టమాటా రేటు 

  • కూలి గిట్టుబాటు కాదని పంటను వదిలేస్తున్న పలువురు రైతులు

శివ్వంపేట, వెలుగు: మార్కెట్ లో ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడంతో కూలి గిట్టుబాటు కాదని రైతులు తెంపకుండా చేన్లనే వదిలేస్తున్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు 50 పైగా ఎకరాల్లో టమాట సాగు చేశారు. దిగుబడి వచ్చే సమయానికి మార్కెట్​లో ధర పూర్తిగా పడిపోయింది.  కొందరు రైతులు టమాటాను తెంపకుండానే చేనులో వదిలివేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే ధర లేక పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేశానని 1.20 ఎకరాల్లో పంటను కోయగా.. మరో రెండు ఎకరాల్లో   తెంపకుండా వదిలేశానని రైతు హరి గౌడ్ పేర్కొన్నాడు.  రోజుకు 200 బాక్సులు వస్తాయని,  ప్రస్తుతం మార్కెట్​లో ఒక్క బాక్స్ కు రూ.50 మాత్రమే ధర ఉందని వాపోయాడు.  ఆటో కిరాయి రూ.30 అవుతుండగా, బాక్స్ కు రూ.20 మాత్రమే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కూలీల డబ్బులు కూడా భారంగా మారడంతో  టమాటా పంటను చేనులోనే  వదిలేసినట్టు చెప్పాడు. రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టగా ఖర్చులు కూడా వచ్చేటట్లు లేదని వాపోయాడు.