తెలుగు సినిమా డైరెక్టర్పై మంతెన అభిమానుల దాడి.. ఆ సీన్లు ఉన్నందుకేనా?

తెలుగు సినిమా డైరెక్టర్ పై థియేటర్ లో దాడి జరిగింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా థియేటర్ కు వచ్చిన డైరెక్టర్ పై దాడి జరగడంతో థియేటర్ లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 'డ్రింకర్ సాయి' మూవీ డైరెక్టర్ పై ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేశారు. సినిమాలో ఆయనను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేశారు. గుంటూరు శివ థియేటర్ లో ఈ ఘటన జరిగింది.

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన డ్రింకర్ సాయి మూవీని కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 27న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సక్సెస్ టూర్ లో భాగంగా సినిమా యూనిట్ గుంటూరు శివ థియేటర్ కు వెళ్లగా అనూహ్యంగా దాడి జరిగినట్లు డైరెక్టర్ కిరణ్ తెలిపారు.

ALSO READ | ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ భారీ కటౌట్.. వరల్డ్ రికార్డు

ప్రేక్షకులను సంతోషపెట్టేందుకు సినిమాలు తీసే తమపై దాడి చేయడం సరైంది కాదని సినిమా డైరెక్టర్, నటులు అన్నారు. దాడిని ఖండించారు. సినిమాలో మంతెన సత్యనారాయణను ఎక్కడా అవమాన పర్చలేదని తెలిపారు. ఆయపై గౌరవం పెంచేలాగే సీన్లు తీశామని అన్నారు. మంతెన అంటే తమకు కూడా గౌరవమని, అలాంటిది ఆయనను తామెందుకు కించపరుస్తామని అన్నారు.

సినిమాలో ఉండేవి అన్నీ కల్పిత పాత్రలని ముందే చెప్పామని, అయినా ఎక్కడా మంతెనను కించపరిచేలా సీన్లు చేయలేదని వివరణ ఇచ్చారు. ఏదైనా ఉంటే మాట్లాడాలని లేదంటే ఫిర్యాదు చేయాలని, కానీ దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా డైరెక్టర్ అన్నారు. అయినా దాడులు చేసింది మంతెన అభిమానులని తాము అనుకోవడం లేదని అన్నారు.