
భూమి మీద ఉన్న ప్రాణాంతకమైన, భయంకరమైన సరీసృపాలలో పాములు ఒకటి. కొన్ని పాములు అంత ప్రమాదకరమైనవి కాకపోయినప్పటికీ.. మరికొన్ని మాత్రం తమ బుద్దిని ప్రదర్శిస్తాయి. ఇతర జీవులకు, మనుషులకు హాని చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వీటి వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అయితే అందరూ ఎంతో భయపడే నాగుపాములు, కొండచిలువలతో కొందరు పలు విన్యాసాలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో ఓ చిన్నారి ఇంట్లో పాముతో ఆడుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ చిన్న క్లిప్ చాలా మందికి కోపం తెప్పించింది. చాలా మంది ఆ చిన్నారి తల్లిదండ్రులను తప్పుబడుతూ.. వారి బాధ్యత గురించి ప్రశ్నించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో First_love_addiction అనే పేజీలో పోస్ట్ అయిన ఈ వీడియోలో, ఒక చిన్నారి పామును నేలపై కదుపుతూ.. దాన్ని పట్టుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. పిల్లవాడు పామును ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అది తలుపు వద్ద ఇరుక్కుపోయినప్పుడు, దాన్ని సరిగ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పిల్లాడి చర్యతో ఇంటి పెద్దలు కూడా భయపడ్డారు. చిన్నారి చేతిలో ఉన్న సరీసృపాన్ని గమనించి, వారు ఒక్కసారిగా నేలపై నుండి లేచి ఒక మూలకు పరుగెత్తారు. దాన్ని ఇంట్లోకి, తమ దగ్గరికి తీసుకురావద్దని వారు ఆ పిల్లాడికి సైగలు కూడా చేశారు.
ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుంచి ఇప్పటివరకు 17.7 మిలియన్లకు పైగా వ్యూస్ ను, ఆరు లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. పాము పెయిడ్ యాక్టర్ అని ఒకరు చమత్కారంగా కామెంట్ చేయగా.. మరికొందరేమో పిల్లాడి తల్లిదండ్రులను విమర్శిస్తూ రిప్లై ఇచ్చారు.