పిల్లలు ఎదిగే కొద్ది తల్లిదండ్రుల్లో ఒకటే భయం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురవుతారోనని. పిల్లలు ఎదుగుతున్నారంటే ఒకచోట కుదిరికగా కూర్చోరు. తమకు నచ్చిన పనులు చేస్తూ ఇల్లు పీకి పందిరేస్తారు. అందుకే ఎదిగే పిల్లల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
తాజాగా చైనాలోని జియాంగ్సు రాష్ట్రంలోని హువాయియాన్‌లో ఈ సంఘటన జరిగింది. రెండేళ్ల బాలుడు ఐదో అంతస్తులో ఉన్న తన ఇంటి బెడ్ రూమ్ లో ఆడుకుంటూ కిటికి దగ్గరకు వచ్చి తొంగి చూశాడు. అలా తొంగి చూస్తూ ఒక్కసారిగా కిటికి కింద ఉన్న ఏసీ ఫ్లాట్ మీద పడ్డాడు. కింద పడిపోకుండా ఏసీ ఫ్లాట్ ఫామ్ ను గట్టిగా పట్టుకున్నాడు.
అదే సమయంలో బెడ్ రూమ్ లో తన మనవడు లేకపోవడం ఆందోళన చెందిన నాయినమ్మ కిటీకి నుంచి బయటకు చూడగా ఏసీ ఫ్లాట్ ఫామ్ ను వేలాడుతూ కనిపించాడు. అంతే కంగారుగా నా మనవడిని కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది.
బుడ్డోడు ఏసీ ఫ్లాట్ ఫామ్ కు వేలాడుతుండగా స్థానికులు కాపాడేందుకు గుమిగూడారు. సరిగా ఐదో ఫ్లోర్ నుంచి కిందపడుతుండగా కింద ఉన్న ఓ వ్యక్తి బంతిలా ఒడిసి పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి చేయి కొంచెం బెణికింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ బాలుడ్ని కాపాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రమాదంలో నా చేయి బెణికినా బాలుణ్ని రక్షించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
