సంగమేశ్వరంపై కృష్ణా బోర్డు ఏం చెప్తదో?

సంగమేశ్వరంపై కృష్ణా బోర్డు ఏం చెప్తదో?
డీపీఆర్‌, పర్మిషన్‌లపై నేడు కీలక భేటీ ఏపీ సమర్పించిన డీపీఆర్‌ సమగ్రంగా లేదన్న కేంద్రం కొత్త ప్రాజెక్టు కాదు.. పర్మిషన్‌లు అవసరం లేదన్న ఏపీ ఏం చెప్పుకోవాలన్న కృష్ణా బోర్డు వద్దకు వెళ్లాలన్న కేంద్రం కేఆర్‌ఎంబీ నిర్ణయంపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి హైదరాబాద్‌‌, వెలుగు:  ఏపీ ప్రభుత్వం కడుతున్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం వ్యవహారం కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (కేఆర్‌‌ఎంబీ)కు చేరింది. ప్రాజెక్టు డీపీఆర్‌‌, పర్మిషన్లపై బోర్డు సోమవారం భేటీ కానుంది. కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీతో ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డి, కర్నూల్‌‌ ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్‌‌ రెడ్డి సోమవారం సమావేశమవుతున్నారు. అసలేం జరిగింది? సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌‌ను రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌లో ఇస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం గత నెలలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు కృష్ణా బోర్డుకు నివేదిక పంపింది. అయితే ఏపీ పంపిన 46 పేజీల డీపీఆర్‌‌లో సమగ్ర వివరాలు లేవని, సీడబ్ల్యూసీ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం మళ్లీ పంపాలని ఏపీకి కేంద్రం సూచించింది. దానికి ప్రతిగా తాము కడుతున్నది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే ఎత్తిపోతల పథకం చేపడుతున్నామని  ఏపీ ఈఎన్సీ తెలిపారు. పాత ప్రాజెక్టులకు హైడ్రాలజీ, ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ సహా అన్ని పర్మిషన్లు ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఈ వివరణపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ డీపీఆర్‌‌ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని, చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే కేఆర్‌‌ఎంబీ వద్దకు వెళ్లాలని సూచించారు. కేంద్రానికి ఏపీ ఏం చెప్పిందంటే.. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి కట్టిన తెలుగు గంగ (టీజీపీ), శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌ (ఎస్‌‌ఆర్బీసీ), గాలేరు – నగరి సుజల స్రవంతి (జీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌), చెన్నై వాటర్‌‌ సప్లయ్‌‌, తుంగభద్ర ప్రాజెక్టుపై ఆధారపడ్డ కేసీ కెనాల్‌‌కు ఇప్పటికే హైడ్రాలజీ, ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ సహా అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని ఏపీ చెప్తోంది. ఆ ప్రాజెక్టులకు కృష్ణా జలాల్లో కేటాయింపులూ ఉన్నాయంటోంది. కేసీ కెనాల్‌‌కు నికర జలాలు ఉండగా మిగతా ప్రాజెక్టుల కేటాయింపులను విభజన చట్టంలో పేర్కొన్నారని ఏపీ అధికారులు వాదిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 880 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటి తరలింపు సాధ్యమవుతుందని తెలిపారు. రిజర్వాయర్‌‌లో 15 నుంచి 20 రోజులకు మించి ఈ లెవల్‌‌లో నీళ్లు ఉండకుండా తెలంగాణ సర్కారు పవర్‌‌ హౌస్‌‌ ద్వారా నీటిని తరలిస్తోందని చెప్పారు. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు కాబట్టే కొత్త లిఫ్ట్‌‌ స్కీం చేపట్టామని వివరించారు. కొత్తగా ఒక్క ఎకరానికీ ఈ ప్రాజెక్టుతో నీళ్లు ఇచ్చేది లేదు కాబట్టి దీనికి కొత్తగా పర్మిషన్‌‌ తీసుకోవాలనే ప్రశ్నే రాదని తెలిపారు. నిర్ణయంపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంపై కృష్ణా బోర్డు ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అని రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. లిఫ్ట్‌‌ స్కీం కింద కొత్త ఆయకట్టు లేకున్నా పంపు హౌస్‌‌, డెలివరీ మెయిన్స్‌‌, ఇతర నిర్మాణాలు చేపట్టాలి. సంబంధిత పనుల ఎస్టిమేట్లను బోర్డుకు, సీడబ్ల్యూసీకి సమర్పించి కాస్ట్‌‌ అప్రైజల్‌‌ తీసుకోవాలి. సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌, డెలివరీ సిస్టర్న్‌‌ నిర్మించే ప్రాంతంలో సాయిల్‌‌ టెస్ట్‌‌ కూడా చేయాలి. ఏపీ చేపట్టే ప్రాజెక్టు పాత ప్రాజెక్టులకు సప్లిమెంట్‌‌ కాబట్టి హైడ్రాలజీ క్లియరెన్స్‌‌ అవసరం లేదని బోర్డు చెప్తే వేరే రాష్ట్రాలూ ఇదే అంశం ప్రాతిపదికగా కొత్త ప్రాజెక్టులు చేపట్టే ఆస్కారముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ చేసే వాదనతో బోర్డు కన్విన్స్‌‌ అవుతుందా.. రూల్స్‌‌ ప్రకారం డీపీఆర్‌‌ ఇచ్చి అన్ని పర్మిషన్‌‌లు తీసుకోవాలని ఆదేశిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ పరమేశం వ్యక్తిగత కారణాలతో సోమవారం నుంచి సెలవులో వెళ్తున్నట్టు తెలిసింది. ఇలాంటి టైమ్‌‌లో మెంబర్‌‌ సెక్రటరీ ఒక్కరే నిర్ణయం తీసుకుంటారా, ఏపీ వాదనలు విని కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తారా తెలియాల్సి ఉంది.