ఢిల్లీ బయట కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేను బ్లాక్ చేస్తాం: రైతు సంఘాల ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త అగ్రికల్చర్ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ బార్డర్లలో రైతు సంఘాలు ప్రారంభించిన నిరసనలకు శనివారం నాటితో 100 రోజులు పూర్తవుతున్నాయి. ఉద్యమానికి వంద రోజులైన సందర్భంగా ఢిల్లీ బయట ఉన్న ఆరు లైన్ల కుండ్లీ–మనేసర్–పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వేను ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఐదు గంటల పాటు బ్లాక్ చేయనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. కేంద్ర అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కిందటేడాది నవంబర్ 26న నిరసనలు ప్రారంభించారు.
ఎస్కేఎం, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతృత్వం వహిస్తున్నాయి. తమ ఉద్యమానికి మార్చి 6తో వంద రోజులు అవుతున్న సందర్భంగా ఎస్కేఎం స్పోక్స్ పర్సన్ దర్శన్ పాల్ మీడియాతో మాట్లాడారు. రైతు ఉద్యమం వంద రోజులు దాటడం వల్ల.. ఇప్పటికైనా తమ డిమాండ్లను ఒప్పుకోవాలంటూ ప్రభుత్వంపై మోరల్ ప్రెజర్ పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అగ్రిచట్టాలు తమకు డెత్ వారెంట్ వంటివని, అవసరమైతే సుదీర్ఘకాలం పాటు పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
