కలెక్టర్​పై దాడిని ఖండిస్తున్నం: టీఎన్జీవో, టీజీవో సంఘాలు

హైదరాబాద్​, వెలుగు: ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్  కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీవో, టీజీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్,  ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ అన్నారు. ఈ దాడికి నిరసనగా మంగళవారం ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు  ధరించి డ్యూటీలకు అటెండ్  కావాలని సోమవారం ఒక ప్రకటనలో వారు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్ట పరిధిలో శిక్షించాలని నేతలు డిమాండ్  చేశారు. ప్రజాభిప్రాయాన్ని చెప్పాలి తప్ప దాడి చేయటం కరెక్ట్ కాదన్నారు.

వికారాబాద్‌లో అధికారులపై దాడి అమానుషం: అగ్రి డాక్టర్స్ అసోసియేషన్

వికారాబాద్‌లో అధికారులపై జరిగిన దాడి అమానుషమని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దాడిని ఖండిస్తూ తెలంగాణ అగ్రి డాక్టర్స్​ అసోసియేషన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు కె. రాములు, రాష్ట్ర అధ్యక్షుడు సాల్మాన్​ నాయక్, కార్యదర్శి తిరుపతి నాయక్​మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకట్‌రెడ్డిపై లగచర్ల గ్రామస్తులు అక్కడ దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.