తిరుపతి తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం ఆరుకు చేరింది. ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొందరు ఊపిరి ఆడక స్పృహా తప్పి పడిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి తొక్కి సలాట ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ | తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!

క్షతగాత్రులు చికిత్స పొందుతోన్న రుయా ఆసుపత్రి వద్దకు తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరగడానికి అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కౌంటర్ల వద్ద అంబులెన్స్ లు ఉంచిన డ్రైవర్లు ఎక్కడికో వెళ్లిపోయారని.. తొక్కిసలాట  జరిగిన వెంటనే వారు సకాలంలో స్పందించలేదని.. అంబులెన్స్ డ్రైవర్లు వెంటనే  రియాక్ట్ అవుతే మరణాల సంఖ్య తగ్గేదని భక్తులు అంటున్నారు. 

తిరుమలలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.