తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం ప్రశ్నల వెల్లువ.. భక్తుల మనోభావాలతో ఆటలొద్దంటూ సీరియస్..

తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ సహా పలు ఇతర పిటీషన్లపై ఇవాళ ( సెప్టెంబర్ 30, 2024 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వాడినట్లు సాక్ష్యం ఉందా అంటూ ప్రశ్నించింది ధర్మాసనం. ఏదైన విషయంలో అనుమానం ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం... అలాంటిది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ ఈ అంశంలో నెయ్యిని సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో ల్యాబ్ కు ఎందుకు పంపలేదంటూ ప్రశ్నించింది.

ఈ అంశంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా... సిట్ ఏర్పాటు కాకముందే ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నించింది సుప్రీం. విచారణ జరగకముందే ఇలాంటి ప్రకటన చేయటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడింది ధర్మాసనం. సెప్టెంబర్ 18న సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. టీటీడీ అధికారే స్వయంగా  కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యిని ఉపయోగించలేదని చెబుతున్నారని, ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది సుప్రీంకోర్టు.

లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఎలా నిర్దారించారు.. లడ్డూను టెస్టింగ్ కి పంపించారా అంటూ ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత బాగాలేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది లూత్రా పేర్కొనగా... మరి అలాంటప్పుడు ఆ లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తేల్చడం కోసం ల్యాబ్ కు పంపించారా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

ALSO READ | కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు ఎక్కడ: దేవుడిని అయినా రాజకీయాలకు దూరం పెట్టండి : సుప్రీంకోర్టు

తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు అన్నీ ఉంటాయని... తిరస్కరించిన నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించినట్టు ఆధారాలే లేవని స్పష్టం చేసింది. విచారణ పూర్తికాక ముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది సుప్రీంకోర్టు. సుదీర్ఘ విచారణ తర్వాత గురువారానికి ( అక్టోబర్ 3, 2024 ) వాయిదా వేసింది సుప్రీంకోర్టు.