తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం.. ఎప్పుడంటే..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్​ 17  సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.  శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా  ఏప్రిల్​ 17 బుధ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్రదీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.