మార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో రేపటి  ( మార్చి 20) నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు( మార్చి 20)  శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను దర్శనం ఇవ్వనున్నారు. ఇక, రెండో రోజున ( మార్చి 21) రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై మూడుసార్లు విహరించనున్నారు. అలాగే, మూడో రోజున( మార్చి 22)  శ్రీభూ సమేతంగా మలయప్పస్వామిగా పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. అయితే, నాల్గవ రోజున( మార్చి 23)  ఐదుసార్లు, చివరి రోజు( మార్చి 24)  ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో శ్రీవారు విహరించనున్నారు. ఇక, తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

 ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, భక్తులకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను మార్చి 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

ALSO READ :- SSCలో 2049 జాబ్స్‌కు దరఖాస్తు గడువు పెంపు