తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికుల పడిగాపులు

తిరుమల: ఏమైంది తిరుమల తిరుపతి కొండకు.. నిన్నటికి నిన్న తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు వెంకన్న భక్తులు చనిపోయారు.. ఈ ఘటన జరిగి 12 గంటలు కూడా కాకముందే.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం. ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. తిరుమల చరిత్రలోనే ఘాట్ రోడ్డుపై ఇలాంటి ట్రాఫిక్ జాం చూడలేదని  స్థానికులు అంటున్నారు.

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేస్తుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంట నుంచి ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తిరుపతి నుండి తిరుమలకు వెళుతున్న ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో జరిగిన దుర్ఘటన కారణంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అయినప్పటికీ ఘాట్ రోడ్ కావడంతో వాహనాలను దారి మళ్లించే పరిస్థితి లేకపోయింది.

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం తోపులాట చోటుచేసుకుంది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినోళ్లలో ఐదుగురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్లలో 20 మంది రుయా ఆస్పత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.