తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి ప్రతి రోజూ ఆరు పూజలు.. షట్ కాల పూజల్లో వెంకన్న వైభవం

వెలుగు:  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామికి ప్రతి రోజూ ఆరుసార్లు పూజలు చేస్తారు. స్వామిని ఉదయం మూడు గంటలకే  మేలుకొలిపి.. రాత్రి ఒంటి గంటకు పవళింపజేసే వరకు ఈ పూజలుంటాయి. వీటినే ఆగమంలో 'షట్కాల పూజలు' అంటారు. వాటిలో ఏకాంత సేవ మాత్రం ఏడాదిలో పదకొండు నెలలు వేంకటేశ్వరస్వామికి చేసి, ఒక నెల శ్రీకృష్ణుడికి చేస్తారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి వైఖానస ఆగమోక్తంగా రోజుకు ఆరుసార్లు పూజలు చేస్తారు. దీన్నే ఆగమ పరిభాషలో 'షట్కాల పూజ' అంటారు.షట్కాలాలు అంటే ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న అపరాహ్న, సాయంకాల, రాత్రి వేళలు. సుప్రభాత సేవతోమొదలయ్యే ఈ పూజలు ఏకాంత సేవతో ముగుస్తాయి. 'కాం సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే.. అంటూ సుప్రభాతంతో శ్రీమన్నారాయణుడిని మేల్కొలుపుతారు. రోజూ చేసే పూజల్లో ఇదే మొదటిది. ఈ పూజు ఉదయం మూడు గంటలకు మొదలవుతుంది. 

ముందుగా అర్చకులు, జీయంగార్లు, ఏలాంగులు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన యాదవ వంశస్తుడు ఆలయానికి వస్తారు. అప్పుడే నగారా మండపంలో గంట మోగిస్తారు. మహాద్వారం నుంచి యాదవ గొల్ల ముందు నడుస్తుండగా అర్చకులు ఆలయంలోకి వస్తారు. కుండె కోట, తాళంచెవి ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయం తలుపులు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. తాళ్లపాక అన్నమాచార్య వంశస్తుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు లోపలికి వెళ్తాడు. వెంటనే అర్చకులు. సుప్రభాతం పాడడం మొదలు పెడతారు. అప్పుడు తాళ్లపాక వంశస్తుడు తంబురా మీటుతూ మూలమూర్తిని మేల్కొలుపుతాడు. అర్చక స్వాములు అంతర్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరిస్తారు. పరిచారకులు స్వామి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకుడు నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చి నవనీత హారతి ఇస్తాడు. అప్పటికి మంగళాశాసనం చదవడం పూర్తవుతుంది. తలుపులు తెరిచి మరో సారి స్వామికి కర్పూర హారతిచ్చి భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.

నిర్మాల్య శోధన

ఉదయం 3.30 నుంచి 3.45 నిమిషాల వరకు గర్భాలయం శుద్ది చేస్తారు. రాత్రి చేసిన అలంకరణలు తీసేస్తారు. వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావిలో వేస్తారు. దీన్ని నిర్మాల్య శోధన అంటారు.. 

అర్చన పూజ....

ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారికి అర్చన పూజ చేస్తారు. జీయంగారు పూలగది నుంచి పుష్పమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురు . గంపను తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తీసుకొస్తారు. పురుషుసూక్తం చదువుతూ... భోగ శ్రీనివాసుడికి అవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపు నీళ్లతో అభిషేకం చేస్తారు.సంప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని విశ్వాసం. తర్వాత మూలమూర్తికి పూలు సమర్పించి, నామధారణ, కర్పూరంతో శ్రీవారి నుదుటన ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంక చేస్తారు. తర్వాత శ్రీవారిని సువర్ణ తిరువడి) స్నాన పీఠంలో ఉంచి అభిషేకం చేస్తారు.

 విశేష అలంకరణ

తమిళంలో తోడు అంటే 'దారంతో కట్టిన పూలమాల" అని అర్థం. కాలక్రమంలో తోమాలగా మారింది. ఈ తోమాల సేవనే'భగవతీ ఆరాధన' అంటారు. ఈ సేవలో భాగంగా స్వామిని సుగంధ సువాసనలు వెదజల్లే పూలమాలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవతో స్వామిని మరింత అందంగా అలంకరిస్తారు.

 లెక్కల అప్పుగింత

తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మండపంలో శ్రీనివాసమూర్తికి దర్బార్ నిర్వహిస్తారు. రాజోచిత మర్యాదలు. చేసి.. గ్రహసంచార క్రమం, ఆ రోజు జరిపించబోయే ఉత్సవాల గురించి చెప్తారు. ముందు రోజు హుండీ ఆదాయ వివరాలను కూడా చెప్తారు. తర్వాత నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని స్వామికి నైవేద్యంగా పెడతారు. 

సహస్రనామార్చనతో..

ఈ క్రతువు ఉదయం 4.45 నుంచి 5.30 వరకు జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని వెయ్యి నామాలతో స్వామివారిని స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాలు మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజలు చేస్తారు. ఈ సమయంలో వరాహపురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పరిస్తారు. తర్వాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇవ్వటంతో పూజ పూర్తవుతుంది. 

అష్టోత్తర శతనామార్చన

ఈ అర్చనతోనే స్వామివారికి మధ్యాహ్న పూజలు మొదలవుతాయి. వరాహ పురాణంలో వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఉన్న 108 నామాలను అర్చకులు చదువుతారు. అష్టోత్తర శత నామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి. మూర్తులకు లక్ష్మీ నామార్చన చేస్తారు. అక్కడితో వేంకటేశ్వరునికి, దేవేరుల సహితంగా  మధ్యాహ్నపూజలు పూర్తవుతాయి.

 రెండో గంటతో పిండివంటలు

అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయం లో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలను స్వామికి నైవేద్యంగా పెడతారు. తర్వాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి కూడా జరుగుతుంది. తర్వాత అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి.

తొలి నైవేద్యం....

మేలుకొలుపు, అభిషేకాలు, కొలువు కూటం, సహస్రనామార్చన పూర్తయ్యాక స్వామికి నైవేద్యం పెడతారు. అంతకుముందే శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మండపంలోని గంటలుమోగిస్తారు. అర్చకులు మాత్రం లోపలే ఉండి స్వామికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలితో పాటు లడ్డూ, వడలు, దోసెలు సమర్శిస్తారు.

ఏకాంత సేవతో విరామం

క్షణం తీరిక లేకుండా ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చే స్వామికి అర్థరాత్రి తర్వాత ఒంటి గంటకు పవళింపు సేవ చేస్తారు. దీనినే 'ఏకాంత సేవ' అని కూడా అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్లు, బాదం పప్పు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెల్లో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. ఇది తాళ్లపాక వారి లాలిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి, ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి చేస్తారు. ఏకాంత సేవతో ఆ రోజు చేసే పూజలన్నీ ముగుస్తాయి. రాత్రి రెండు గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందు మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియలు వేస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీలు వేసే సంప్రదాయం అనాది కాలం నుంచి వస్తోంది.

V6 వెలుగు