తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి తొలి నైవేద్యంగా దోసెలు, వడలు..!

 వెలుగు: తిరుమల వేంకటేశ్వరస్వామికి వైఖానస ఆగమోక్తంగా రోజుకు ఆరుసార్లు పూజలు చేస్తారు. దీన్నే ఆగమ పరిభాషలో 'షట్కాల పూజ' అంటారు.షట్కాలాలు అంటే ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న అపరాహ్న, సాయంకాల, రాత్రి వేళలు. సుప్రభాత సేవతోమొదలయ్యే ఈ పూజలు ఏకాంత సేవతో ముగుస్తాయి. 

తొలి నైవేద్యం....

మేలుకొలుపు, అభిషేకాలు, కొలువు కూటం, సహస్రనామార్చన పూర్తయ్యాక స్వామికి నైవేద్యం పెడతారు. అంతకుముందే శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మండపంలోని గంటలుమోగిస్తారు. అర్చకులు మాత్రం లోపలే ఉండి స్వామికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలితో పాటు లడ్డూ, వడలు, దోసెలు సమర్శిస్తారు.

రెండో గంటతో పిండివంటలు

అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయం లో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలను స్వామికి నైవేద్యంగా పెడతారు. తర్వాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి కూడా జరుగుతుంది. తర్వాత అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి.

V6 వెలుగు