- మహమ్మారి జబ్బుకు మన ఒంట్లోనే సమాధానం
కేన్సర్.. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. కేన్సర్ అనగానే ముందు గుర్తొచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ. దాని వల్ల కేన్సర్ కణాలు చనిపోయినా, ఆ ట్రీట్మెంట్తో కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఒళ్లు పుండు పడిపోతుంది. తీవ్రమైన నొప్పితో రోగి అల్లాడిపోవాల్సిందే. పవర్ఫుల్ మందులతో జుట్టు రాలిపోతుంది. మరి, కేన్సర్‌కు కీమోథెరపీ తప్ప వేరే ట్రీట్మెంట్ లేదా? అంటే ‘మన ఒంట్లోనే అద్భుతమైన ట్రీట్మెంట్’ ఉంది అంటున్నారు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు. మన శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు విడుదల చేసే ‘బబుల్స్’, కేన్సర్ కణాలను చంపేందుకు వారధిలా పనిచేస్తాయంటున్నారు. ఎలుకల్లో రొమ్ము కేన్సర్ కణాలపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు.
ట్రీట్మెంట్ ఎట్ల చేస్తరు?
ఒంట్లో ప్రొటీన్లు తయారు కావాలంటే ఆర్ఎన్ఏ (రైబో న్యూక్లియిక్ యాసిడ్) చాలా ముఖ్యం. మరి, అవి ప్రొటీన్లు తయారు చేయడానికి అవసరమయ్యే మరింత ముఖ్యమైన సమాచారాన్ని జీన్స్‌గా భావించే డీఆక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్ (డీఎన్ఏ)లు స్టోర్ చేస్తాయి. ఆ సమాచారానికి తగ్గట్టుగానే అవి పనిచేస్తుంటాయి. ఈ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను శరీరంలోని కణాలకు చేరేవేసేవే ఈ చిన్నచిన్నని కణ బుడగలు (బబుల్స్). కేన్సర్ ట్రీట్మెంట్లో వాడే మందులను, జీన్స్‌ను పాడైపోయిన కణాల దగ్గరకు మోసుకెళ్లే వాహకాల్లా (ట్రాన్స్పోర్టర్) ఈ బబుల్స్పనిచేస్తాయి. వాటిని చంపేస్తాయి. ‘‘కేన్సర్ కణాల పనిపట్టే మందులు శరీరంలోకి ఎక్కించాక, ఆ కేన్సర్ కణాలపై అవి మెరుగ్గా పనిచేసేందుకు డీఎన్ఏ తయారు చేసే కొన్ని రకాల ఎంజైములు వాటిని విషంగా మార్చేస్తాయి. అలాంటి ఎంజైములను టార్గెట్ చేసిన ట్యూమర్ కణాల దగ్గరికే తీసుకెళ్లేలా ఈ సరికొత్త ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది” అని పరిశోధనకు నేతృత్వం వహించిన మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ ఫార్మకాలజీ, టాక్సికాలజీ ప్రొఫెసర్ మసమిట్షు కనాడా చెప్పారు.
సగం కేన్సర్ కణాలు చచ్చాయ్
మామూలుగా కొన్ని డ్రగ్స్ లేదా ప్రోడ్రగ్స్ బయట ఇనాక్టివ్‌గా (పనిచేయవు) ఉంటాయి. ఒంట్లోకి చేరిన వెంటనే అవి యాక్టివ్ అవుతాయి. తమ పని చేసుకుంటూ పోతాయి. కేన్సర్ విషయంలోనూ అంతే. ఈ స్టడీలో భాగంగా సైంటిస్టులు గాన్సిక్లోవిర్, సీబీ 1954 అనే రెండు రొమ్ము కేన్సర్ మందులను తీసుకున్నారు. ఇవి రెండూ ప్రోడ్రగ్సే. వాటిని శరీరంలో యాక్టివేట్ చేసేందుకు అవసరమయ్యే ఎంజైములను తయారు చేసే జీన్స్‌ను ఎక్స్ట్రా సెల్యులార్ వెసికిల్స్ (ఈవీ)లో పెట్టారు. ఇప్పుడు ఆ ఈవీల్లోకి మినీసర్కిల్ డీఎన్ఏ (ఇవే కణాలు తయారు చేసే బబుల్స్), ప్లాస్మిడ్ అనే రెండు వాహకాలనూ పంపారు. ఈ రెండు వాహకాలు ఆ మందులను కేన్సర్ కణాల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. దీన్నే జీన్ డైరెక్టెడ్ ఎంజైమ్, ప్రోడ్రగ్ ట్రీట్మెంట్ అంటారు. ప్లాస్మిడ్తో పోలిస్తే మినీసర్కిల్ డీఎన్ఏ 14 రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేసిందని గుర్తించారు. కేన్సర్ కణాలను తుడిచిపెట్టేసినట్టు తేల్చారు. ‘‘ప్లాస్మిడ్ పద్ధతిలో కేన్సర్ కణాలు ఒక్కటి కూడా చనిపోలేదు. కానీ, మినీసర్కిల్ డీఎన్ఏ ట్రీట్మెంట్లో సగానికిపైగా రొమ్ము కేన్సర్ కణాలు తుడిచిపెట్టుకుపోయాయి” అని కనాడా చెప్పారు. కాబట్టి కీమోథెరపీ కన్నా ఈ మినీసర్కిల్ డీఎన్ఏ ట్రీట్మెంట్అలియాస్ బబుల్ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అన్నారు. మామూలు కీమోథెరపీ ట్రీట్మెంట్లో ఆరోగ్యవంతమైన కణాలు, కేన్సర్ కణాల మధ్య తేడాలు తెలుసుకోవడం కష్టమవుతుందని, దాని వల్ల ఆరోగ్యవంతమైన కణాలూ చచ్చిపోతుంటాయని చెప్పారు. ఫలితంగా రోగి బక్కపలుచగా మారి నీరసించుకుపోతారని అన్నారు. బబుల్ ట్రీట్మెంట్లో కేవలం కేన్సర్ కణాలు మాత్రమే చచ్చిపోతాయన్నారు. అంతేగాకుండా ఇవి ఒంట్లోనే ఉంటాయి కాబట్టి, శరీరం కూడా వాటికి తగ్గట్టే స్పందిస్తుందని, ట్రీట్మెంట్కు సహకరిస్తుందని చెప్పారు. అవసరం లేని ఇమ్యూన్ రెస్పాన్స్‌లను ఈ ట్రీట్మెంట్లో నిరోధించొచ్చని చెప్పారు. త్వరలోనే ఈ కొత్త ట్రీట్మెంట్లో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ అతి త్వరలోనే అమెరికాలో ప్రారంభించబోతున్నారు. ఈవీలతో పాటు కొన్ని రకాల ఆర్ఎన్ఏ అణువులనూ ట్రయల్స్‌లో వాడబోతున్నారు. మెటాస్టాటిక్ పాంక్రియాటిక్ కేన్సర్‌పై ట్రయల్స్ చేయబోతున్నారు. అప్పటి వరకు ఈ ఈవీల పనితీరు, సేఫ్టీపై మరిన్ని పరిశోధనలు చేసి, వాటిని మరింత పటిష్టంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
