IND Vs NZ, 1st Test: సిక్సుల్లో సెహ్వాగ్, రోహిత్‌ను దాటేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫాస్ట్ బౌలర్ గా 16 ఏళ్ళు న్యూజిలాండ్ తరపున ఆడుతూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మంచి స్వింగ్ బౌలర్.. అద్భుతమైన పేస్ వేయగల బౌలర్.. అనుభవమున్న బౌలర్ గా అందరికీ తెలుసు. అయితే అతను టెస్టుల్లో ఒక విధ్వంసకర బ్యాటర్ అనే సంగతి కొంతమందికే తెలుసు. టెస్టుల్లో ఈ కివీస్ పేసర్ ఏకంగా  టీమిండియా పవర్ హిట్టర్లు సెహ్వాగ్, రోహిత్ శర్మలను దాటేశాడు. 

సౌథీ టెస్ట్ కెరీర్ లో ఇప్పటివరకు 93 సిక్సులు కొట్టాడు. మరోవైపు సెహ్వాగ్ 91 సిక్సులు బాదితే.. రోహిత్ శర్మ 87 సిక్సులతో అతనికంటే వెనకనే ఉన్నారు. ప్రస్తుతం భారత్ పై జరుగుతున్న బెంగళూరు టెస్టులో సౌథీ నాలుగు సిక్సులు కొట్టడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. వన్డే మాదిరి ఆడుతూ 73 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సౌథీ మొత్తం 103 టెస్టులు ఆడాడు. 

ALSO READ | IND Vs NZ, 1st Test: న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం.. 137 ఏళ్ళ చరిత్రను భారత్ తిరగరాస్తుందా

ఓవరాల్ గా టెస్టుల్లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 131 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మెక్కలం, గిల్ క్రిస్ట్, గేల్, కల్లిస్ వరుసగా రెండు, మూడు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 93 సిక్సులతో సౌథీ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బెంగళూరు టెస్ట్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. రచీన్ రవీంద్ర 134 పరుగులు చేసి మూడో రోజు ఒక్కడే వారియర్ లా పోరాడాడు. దీంతో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.