NZ vs ENG: సిక్సర్లతో గేల్ రికార్డ్ సమం చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫాస్ట్ బౌలర్ గా 16 ఏళ్ళు న్యూజిలాండ్ తరపున ఆడుతూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మంచి స్వింగ్ బౌలర్.. అద్భుతమైన పేస్ వేయగల బౌలర్.. అనుభవమున్న బౌలర్ గా అందరికీ తెలుసు. అయితే అతను టెస్టుల్లో ఒక విధ్వంసకర బ్యాటర్ అనే సంగతి కొంతమందికే తెలుసు. టెస్టుల్లో ఈ కివీస్ పేసర్ ఏకంగా సిక్సర్లు కొట్టడంలో టీమిండియా పవర్ హిట్టర్లు సెహ్వాగ్, రోహిత్ శర్మలను దాటేశాడు. క్రిస్ గేల్ రికార్డ్ ని సైతం సమం చేశాడు.   

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన మూడో టెస్ట్ శనివారం (డిసెంబర్ 14) ప్రారంభమైంది. హామిల్టన్ వేదికగా సీడెన్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. తన చివరి టెస్ట్ మ్యాచ్ లో సౌథీ టెస్టుల్లో క్రిస్ గేల్ రికార్డ్ సమం చేశాడు. తొలి రోజు ఆటలో భాగంగా మూడు సిక్సర్లు కొట్టిన సౌథీ తన సిక్సర్ల సంఖ్యను 98 కి పెంచుకున్నాడు. గేల్ కూడా టెస్టుల్లో 98 సిక్సులు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సౌథీ 10 బంతుల్లోనే 3 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 23 పరుగులు చేశాడు.   

Also Read :- టీమిండియాకు బిగ్ షాక్

మరో సిక్సర్ కొడితే గేల్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. రెండు సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్ లో చేరతాడు. ఓవరాల్ గా టెస్టుల్లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 133 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మెక్కలం, గిల్ క్రిస్ట్, గేల్, కల్లిస్ వరుసగా రెండు, మూడు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 204 పరుగుల ఆధిక్యం లభించింది.