Syed Mushtaq Ali Trophy: తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‏గా రికార్డ్

టీ20 క్రికెట్ లో తిలక్ వర్మ అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. వరుస సెంచరీలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాపై చివరి రెండు టీ20ల్లో సెంచరీలు బాదిన ఈ తెలుగు కుర్రాడు మరో విధ్వంసకర సెంచరీతో టీ20 క్రికెట్ లో వరుసగా మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ కుర్రాడు మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు.  

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 67 బంతుల్లో 151 పరుగులు చేసి ప్రత్యర్థిని వీర విహారం చేశాడు. తిలక్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ కేవలం 28 బంతుల్లో.. అర్ధ సెంచరీని.. ఆ తర్వాత 51 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ మెరుపులతో హైదరాబాద్ ఈ మ్యాచ్ లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ప్రపంచ క్రికెట్ లో వరుసగా మూడు టీ20 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను కూడా నమోదు చేశాడు. ఈ టోర్నీలో ముంబై బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ చేసిన 147 పరుగుల రికార్డ్ ను తిలక్ బ్రేక్ చేశాడు.