పులి సంకటం! గోదావరి వెంట పెరిగిన పెద్దపులుల సంచారం

  • టైగర్ మూమెంట్​ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు
  • వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్​కు ముప్పు
  • చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం
  • గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు
  • ఉమ్మడి ఆదిలాబాద్​లో ఈ మధ్య పులుల దాడిలో ముగ్గురు మృతి

మంచిర్యాల, వెలుగు: కొన్నిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం పెరగడం అటు ఫారెస్ట్ ఆఫీసర్లకు, ఇటు అటవీ సమీప పల్లెల ప్రజలకు సంకటంగా మారింది. ఆసిఫాబాద్ ​జిల్లాలో పత్తి ఏరుతున్న మహిళను పులి చంపడం, మరో రైతుపై దాడి చేయడంతో జనాలకు కంటి మీద కునుకు కరువైంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి కనిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో టెన్షన్​ మొదలైంది.

పులి ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ప్రజలు.. వేటగాళ్ల వల్ల టైగర్​కు ఎక్కడ, ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని అటవీ అధికారులు హైరానా పడుతున్నారు. ఆయా జిల్లాల్లో ఎప్పటికప్పుడు టైగర్స్​ మూమెంట్​ను ట్రాక్ చేస్తున్న ఆఫీసర్లు.. పులుల కదలికల గురించి బయటకు చెప్తే వాటికి ఏమవుతుందోనని ఓవైపు, చెప్పకపోతే ప్రజలకు ప్రమాదం జరిగితే ఎలా అని మరోవైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా పులుల రక్షణ దృష్ట్యా వాటి మూమెంట్​ను ఫారెస్ట్ ఆఫీసర్లు బహిర్గతం చేయరు. కానీ, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఇటీవల పులుల దాడులు పెరగడంతో ప్రజలకు చెప్పక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 

ప్రజలను వెంటాడుతున్న భయం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్​కు తిప్పేశ్వర్, తడోబా అభయారణ్యాల నుంచి పెద్ద పులులు వచ్చాయని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.  ఆదిలాబాద్ జిల్లా బోథ్, నిర్మల్ జిల్లా కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి, కడెం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, హాజీపూర్, కాసిపేట, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిసరాల్లో ఇటీవల వాటి కదలికలను గుర్తించారు.మేకలు, పశువులపై పులి దాడి చేయడంతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. అధికారులు పులుల పాదముద్రలు, సీసీ కెమెరాలు, ట్రాకర్స్ ద్వారా టైగర్ మూమెంట్​ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే రెండు పెద్ద పులులు  ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ టైగర్ కారిడార్ వైపు వెళ్లినట్టు పేర్కొన్న అధికారులు.. అవి తిరుగుతున్న ఏరియాల గురించి స్పష్టంగా చెప్పలేదు. గతంలో ఇలా స్పెసిఫిక్​ సమాచారం ఇచ్చినప్పుడు.. వేటగాళ్లు పెద్ద పులులను పొట్టనపెట్టుకోవడమే ఇందుకు కారణం. కానీ, గత నెల 29న కాగజ్​నగర్​ రేంజ్​ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిని చంపేసిన పులి.. మరుసటి రోజే సిర్పూర్(టి)మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతు రౌతు సురేశ్​పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

Also Read:-పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి

ఈ రెండు ఘటనలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలు నేటికీ భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పత్తి ఏరే సీజన్​కావడంతో చేన్ల వైపు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరోవైపు రెండు పులులు ఇంకా మహారాష్ట్ర బోర్డర్​లోనే తిరుగుతున్నాయని ప్రకటించిన ఆఫీసర్లు.. 14 గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, ప్రజలకు ప్రత్యేక మాస్కులు అందజేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం శివార్లలో పులి కదలికలను ఫారెస్ట్​ ఆఫీసర్లు  నిర్ధారించడంతో ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలోని జనాల్లోనూ వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే  పులి ఏ రోజు ఎక్కడ ఉంటుందో ఫారెస్ట్​ ఆఫీసర్లు చెప్పాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 

పులులకు పొంచి ఉన్న ముప్పు

కొన్నేండ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో టైగర్ మూమెంట్​ను పరిశీలిస్తే... ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో  పెద్దపులులు తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి ఇక్కడికి వలస వస్తున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా చలికాలం టైగర్ మేటింగ్ సీజన్ కావడంతో ఆడ, మగ పులులు తోడును వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఇటు పులుల వల్ల ప్రజలకు, అటు వేటగాళ్ల వల్ల పులులకు ప్రమాదాలు పొంచి ఉండడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు. గతంలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెద్దపులులు వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఘటనలున్నాయి.

2016లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో వేటగాళ్లు కరెంట్ షాక్ పెట్టి పులిని చంపారు. 2019 జనవరి 8న జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్​లో మరో పులి ఇదేవిధంగా మరణించింది. తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్, కవ్వాల్ మీదుగా వచ్చిన బెంగాల్ రాయల్ మేల్ టైగర్​ను యానిమల్ ట్రాకర్స్ సాయంతో పులి హంతక ముఠా చంపేయడం అప్పట్లో సంచలనం రేపింది. పులి చర్మం, గోళ్లను ఒలిచి, తలను ముక్కలు చేసి.. కళేబరాన్ని పాతిపెట్టారు. దాని చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ముఠా సభ్యుల మధ్య విభేదాలు రావడంతో ఈ విషయం బయటపడ్డది.

‘టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్’ అనే ఎన్జీవో ముసుగులో చంద్రాపూర్​కు చెందిన కొంతమంది యానిమల్ ట్రాకర్లను ట్రాప్ చేసి పులిని మట్టుబెట్టినట్టు తేల్చిన అధికారులు.. ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేశారు. మరో కేసులో నిరుడు కోటపల్లి మండలానికి చెందిన ఆరుగురిని అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్​లో ఆవాసం ఏర్పర్చుకున్న కే4 ఫిమేల్ టైగర్ మూడేండ్ల కిందటి నుంచి జాడ లేకుండా పోయింది.

ఆ పులి అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కి బయటపడ్డప్పటికీ.. కడుపు భాగంలో బిగిసుకున్న ఉచ్చుతోనే దాదాపు రెండేండ్లు సంచరించి మాయమైంది. ఇది బతికి ఉందో, చనిపోయిందో ఇప్పటికీ తెలియదు. అందుకే పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్​చేస్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు.. అది ఏ అడవుల్లో సంచరిస్తున్నదో చెప్తున్నారు తప్ప అది ఉన్న చోటును కచ్చితంగా చెప్పడం లేదు. పులుల రక్షణ దృష్ట్యా ఇలా చేస్తున్నప్పటికీ.. పులుల సంచారం పెరగడంతో జనం భయం భయంగా బతుకుతున్నారు. 

పత్తి చేనుల్లోనే దాడులు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఈ మధ్యకాలంలో పెద్దపులి దాడిలో ముగ్గురు మృతిచెందారు.  వీరంతా పత్తి చేనులో పత్తి ఏరుతుండగా పెద్దపులి మాటువేసి దాడి చేయడంతో ప్రాణాలు విడిచారు. పత్తిచేను ఏపుగా పెరగడంతో  చెట్ల మాటున ఉన్న జంతువులు, మనుషులు కనిపించని పరిస్థితి ఉంటుంది. పత్తిచేనులో ఉన్న టైగర్ ను గమనించకుండా కూలీలు పనుల్లో నిమగ్నమైన క్రమంలో ఒక్కసారిగా పులి దాడి చేస్తుండటం కలవరానికి గురిచేస్తున్నది. ఇతర పంటల విషయానికి వస్తే.. అక్కడ జంతువుల, మనుషుల అలికిడి వినిపిస్తుంది. పత్తి చేన్లలో అలా కాదు. పత్తి చేన్లు ఏపుగా పెరగడంతో ఎక్కడ ఏముందో తెలియదు. పత్తి ఏరే క్రమంలో మనిషి వంగి ఉంటారు. దీంతో పులి దాడిని కూడా గుర్తించలేని పరిస్థితి.

కరెంట్ వైర్లతోనూ ముప్పు..

అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు కరెంట్ వైర్లతో కంచెలు ఏర్పాటు చేస్తుండగా.. వేటగాళ్లు అటవీ జంతువుల కోసం అడవుల్లో కరెంట్ షాక్​తో పాటు ఉచ్చులు పెడుతున్నారు. వీటితో వన్యప్రాణులు, మూగజీవాలతో పాటు మనుషులు కూడా మృత్యువాతపడ్డ సంఘటనలూ ఉన్నాయి. మందమర్రి మండలం సంట్రోనిపల్లి శివారు అడవుల్లో కరెంట్ షాక్ తగిలి ఇటీవల రెండు బర్రెలు చనిపోయాయి.

పెద్దపులిని చంపే ఉద్దేశంతోనే కరెంట్ వైర్లు పెట్టినట్టు ప్రచారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురిపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. జైపూర్ మండలం ముదిగుంట అటవీ ప్రాంతంలో అమర్చిన కరెంట్ వైర్లకు తగిలి మరో బర్రె మృతి చెందింది. ఇట్ల కవ్వాల్ టైగర్ జోన్​లోనే కాకుండా కాగజ్​నగర్ టైగర్ కారిడార్ పరిధిలో కూడా కరెంట్ వైర్లకు వన్యప్రాణులు బలవుతున్నాయి.