కాగజ్​నగర్ అడవుల్లో పులుల అలజడి: మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్స్

  • చీలపల్లిలో ఒకటి, కౌటాలలో మరొకటి సంచారం
  • భయాందోళనలో ప్రజలు 
  • జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన

ఆసిఫాబాద్/మంచిర్యాల/కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్లీ అలజడి రేపింది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు పులులు ప్రవేశించినట్టు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించిన పెద్దపులి.. గురువారం ఉదయానికి సిర్పూర్ (టి) రేంజ్ లోకి ప్రవేశించింది.అది దాని డెన్ గా భావిస్తున్న ఇటికెలపహాడ్, చీలపల్లి ఫారెస్ట్ లోకి  వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు.

మరోవైపు గురువారం ఉదయం కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామ సమీపంలో మరో పులి సంచరించడం కలకలం రేపింది. ఉదయం తన మిర్చి తోటకు వెళ్లిన రైతు జొడే నవీన్ కు పులి కనిపించగా, ఆయన భయంతో ఇంటికి పరుగులు తీశారు. గ్రామస్తులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్ డీవో) వినయ్ కుమార్ సాహూ సిబ్బందితో వచ్చి అడుగులను చూసి పులిగా నిర్ధారించారు. గతంలో ఇక్కడ ఎన్నడూ పులి తిరగలేదు. ఇప్పుడు పులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

వార్దా నది దాటి.. 

పదేండ్లుగా తెలంగాణ, -మహారాష్ట్ర మధ్య పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల పులుల సంచారం పెరగడం, అవి మనుషుల మీద దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంది. పులులు జనావాసాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ల నుంచి పులులు వస్తున్నట్టు గుర్తించారు. బుధవారం మహారాష్ట్రలో కనిపించిన పులి.. సిర్పూర్(టి) మండలం హుడికిలి దగ్గర తెలంగాణలోకి ప్రవేశించిందని పాదముద్రలను బట్టి అధికారులు అంచనా వేస్తున్నారు.

సిర్పూర్, కాగజ్ నగర్ రేంజ్ లోని చీలపల్లి–వేంపల్లె మధ్య అటవీ ప్రాంతంలో పెద్దపులి ఉన్నట్టు భావిస్తున్నారు. దాని కోసం ట్రాకర్ల ద్వారా అన్వేషణ చేపట్టారు. ఇక కౌటాల మండలం గుండాయిపేట్ చేన్లలో కనిపించిన పులి.. మహారాష్ట్రలోని చప్రాల వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ నుంచి వచ్చినట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు  భావిస్తున్నారు. చప్రాల సాంక్చుయరీకి ఆనుకుని ప్రాణహిత, వార్దా, వైన్ గంగ నదులు ఉన్నాయి.  వైన్ గంగ, ప్రాణహిత మీదుగా వార్దా నది దాటి పులి ఇటువైపు వచ్చిందని   కాగజ్ నగర్ ఎఫ్ డీవో వినయ్ కుమార్ సాహూ తెలిపారు. శాకాహార జంతువుల కోసం, నీళ్ల  కోసం నదీ తీర ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ఉంటాయని చెప్పారు. 

మంచిర్యాలలో ఆడపులి..  

మంచిర్యాల ఫారెస్ట్ లోని ముల్కల్ల బీట్ లో ఆడపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అది బుధవారం సఫారీ రోడ్ కెమెరా ట్రాప్​కు చిక్కినట్టుగా నిర్ధారించారు. ఆ పులి ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి అడవుల నుంచి వచ్చినట్టుగా భావిస్తున్నారు. పశువుల కాపరులు, రైతులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.  

ప్రజలకు టైగర్ మాస్క్​లు ఇస్తం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి. కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం శుభపరిణామం. పులి కనిపిస్తే  ప్రజలు, రైతులు ఆందోళన చెందకుండా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ను ఫాలో కావాలి. పులి తిరిగే ప్రాంతానికి  ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలి. కంది, పత్తి పంటలు ఆరు ఫీట్ల వరకు పెరుగుతాయి కాబట్టి అవి పులులు ఉండేందుకు అనుకూలంగా ఉంటాయి.

కాబట్టి రైతులు, కూలీలు పొద్దున  8 గంటల తర్వాతే పొలాలకు వెళ్లాలి. సాయంత్రం 4 గంటలలోపే ఇండ్లకు తిరిగి రావాలి. గ్రామాల్లో రైతులకు, కూలీలకు, ప్రజలకు టైగర్ మాస్క్ లు ఇస్తాం. వీటి కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. ఒకట్రెండు రోజుల్లో వస్తాయి. పులి తనంతట తానుగా మనుషుల మీద దాడి చేయదు. పంటల రక్షణకు చాలామంది రైతులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వీటికి విద్యుత్ కనెక్షన్ పెట్టి పులికి నష్టం చేయవద్దు. 

- వినయ్ కుమార్ సాహూ, కాగజ్ నగర్, ఎఫ్ డీవో