పులుల వరుస దాడులు.. ప్రజల్లో ఆందోళనపై సర్కార్ నజర్

  • పులుల వరుస దాడులు, ప్రజల్లో ఆందోళనపై సర్కార్ నజర్
  • ప్రాణ నష్టం నివారణతో పాటు పులికి సేఫ్ జోన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
  • అటవీ శాఖ చీఫ్ డోబ్రియాల్ జిల్లాలో మకాం
  • ఇప్పటికే ఇంటర్ స్టేట్ మీటింగ్ నిర్వహణ

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడులు, సంచారం, ప్రజల ఆందోళన ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ ను కలవరానికి గురిచేస్తోంది. గత నెల 29న కాగజ్ నగర్ ఫారెస్ట్ లో మోర్లే లక్ష్మిని హతమార్చిన పులి.. మరుసటి రోజు రైతు సురేశ్ మీద దాడి చేసి గాయపర్చింది. దీనికి తోడు పలు చోట్ల పులి సంచరిస్తోందని ప్రచారం సాగుతండడం ఫారెస్ట్​ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో పులులు బయటకు రాకుండా, అవాసం పర్మినెంట్ చేసుకునేలా రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయిం చింది.

 ఇందులో భాగంగానే రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ఆర్ఎం డోబ్రియాల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలూ సింగ్ మేరు జిల్లాలో మకాం వేశారు. శుక్రవారం ఇంటర్ స్టేట్ మీటింగ్ నిర్వహించి.. శనివారం మళ్లీ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పులి రక్షణతో పాటు ప్రజలకు అపాయం కలగకుండా ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రాణాలు కాపాడడమే సవాల్

పులుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు పెద్ద సవాల్​గా మారింది. రాష్ట్రంలో  ప్రధానంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్​లు ఉన్నాయి. అమ్రాబాద్​లో పులులకు రక్షిత ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో వాటి దాడులు తక్కువ. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జన్నారంలోని కవ్వాల్ అడవిని 2012లో టైగర్ రిజర్వ్ గా చేసినప్పటికీ పులి స్థావరం ఏర్పరుచుకోలేదు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ డివిజన్​లో పులుల సంచారం పెరిగింది. 

Also Read : హైదరాబాద్ లో 14 వేల జంటలను ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్

నాలుగేండ్ల క్రితం దహెగాం మండలం దిగడలో, ఆ తర్వాత పెంచికల్​పేట్ మండలం కొండపల్లిలో, 2022 వాంకిడిలో మనుషులపై పులి దాడులు జరిగాయి. టైగర్ రిజర్వ్​లో కూడా లేనివిధంగా కాగజ్ నగర్ ప్రాంతంలో పులుల దాడులు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ను కలవరానికి గురిచేస్తోంది. వరుస దాడుల కారణంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై అటవీ శాఖ దృష్టి పెట్టింది.

మహారాష్ట్ర విధానాలపై ఫోకస్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం, కదలికలు పెరిగాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో మరింత ఎక్కువయ్యాయి. దీంతో పులుల దాడుల నియంత్రణ, ముందు జాగ్రత్తల విషయంలో పొరుగున ఉన్న మహారాష్ట్రలో అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర అటవీశాఖ స్టడీ చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ఫారెస్ట్​లో శుక్రవారం డొబ్రియాల్, ఈలూ సింగ్ మేరు, ఇతర అధికారులు ఇంటర్ స్టేట్ సమావేశం నిర్వహించారు. 

మహారాష్ట్రలోని తాడోబా ఆందేరి టైగర్ రిజర్వ్, తిప్పేశ్వర్ అభయారణ్యంలో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. పులులు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ దాడుల నియంత్రణకు ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్చలపై చర్చించారు. రెండు మూడు రోజుల పాటు మహారాష్ట్రలో టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తామని, అక్కడి పరిస్థితులు, ఎనిమల్ ట్రాకర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు అక్కడి అధికారులను రాష్ట్ర అటవీ శాఖ చీఫ్  కోరారు. దీనికి మహారాష్ట్ర అధికారులు సైతం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు.


సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు..

సాధారణంగా ప్రతీ ఏట చలికాలంలోనే పులి దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. నవంబర్ నుంచి మార్చి వరకు పులుల మేటింగ్ సీజన్ అని, దీంతో పులులు తమ పార్ట్నర్ కోసం వెతుకుతూ సుదూర ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రయాణంలో అగ్రెసివ్ మూడ్ లో ఉండే పులులు తమకు అడ్డుగా వచ్చిన వారిని, ఆహారం కోసం, ఆత్మరక్షణ కోసం దాడులు చేస్తున్నట్లు టైగర్ ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. 

మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్ లకు రాకపోకల ప్రాంతంగా కాగజ్ నగర్ ఫారెస్ట్ ఉండడంతో ఈ ప్రాంతాన్ని సురక్షిత పులుల సంచార, నివాస ప్రాంతంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ పులుల సంరక్షణ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పులుల సంఖ్యను మరింత పెంచేందుకు, దీనికి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.