- బూడిద భిక్షమయ్య వైపు హైకమాండ్ మొగ్గు
- హామీ ప్రకారం తనకే ఇవ్వాలని పట్టుబడుతున్న జిట్టా
- జిట్టాకు టికెట్ ఇవ్వకుంటే ఆందోళనకు దిగుతామన్న కేడర్
యాదాద్రి, వెలుగు : బీఆర్‌ఎస్ భువనగిరి ఎంపీ క్యాండిడేట్ ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ టికెట్‌ను ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు కేటాయించేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుండడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరిన టైంలో ఇచ్చిన హామీ ప్రకారం టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో క్యాండిడేట్ ఎంపికను ప్రస్తుతానికి బీఆర్‌ఎస్ పక్కన పెట్టింది. హోలీ తర్వాత ఖరారు చేయనున్నట్లు సమాచారం.
బీసీ ఫార్ములాతో భిక్షమయ్యగౌడ్ వైపు మొగ్గు
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇక్కడ బీసీ క్యాండిడేట్‌ను బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను రంగంలోకి దించింది.
బీఆర్‌ఎస్ కూడా ఇదే ఫార్ములాను వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం బీసీ సామాజిక వర్గాలకు చెందిన చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్, క్యామ మల్లేశం, బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పరిశీలనలోకి తీసుకున్నారు. బీసీల్లోనూ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉండడం, గతంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన భిక్షమయ్యగౌడ్‌కు భువనగిరి టికెట్‌ను ఖరారు చేయాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.
హామీ నిలబెట్టుకోవాలని జిట్టా పట్టు
భువనగిరి ఎంపీ టికెట్‌ను భిక్షమయ్యగౌడ్‌కు కన్ఫర్మ్ చేస్తున్నారని లీకులు రావడంతో జిట్టా బాలకృష్ణారెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరే టైంలో తన రాజకీయ భవిష్యత్‌పై కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం టికెట్ తనకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. భువనగిరి టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తే హైకమాండ్‌తో తాడో పేడో తేల్చుకుంటానని స్పష్టం చేస్తున్నారు. జిట్టాను కాదని మరొకరికి టికెట్ ఇస్తే తెలంగాణ భవన్ ఎదుట తమ ప్రతాపం చూపుతామని జిట్టా వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
గుంటకండ్లే కారణం ?
జిట్టాకు టికెట్ రాకుండా మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డికి పోటీ చేసే అవకాశం రాకుండా చేసిన గుంటకండ్ల ఇప్పుడు భువనగిరిలోనూ జిట్టాకు టికెట్ దక్కకుండా కుట్ర చేస్తున్నారని పలువురు అంటున్నారు. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బూడిద భిక్షమయ్యకు సపోర్ట్ చేస్తున్నారని స్థానిక లీడర్లు చెబుతున్నారు.
