అయ్యో బిడ్డా!..మృత్యువుతో పోరాడి ఓడిన మూడేండ్ల చిన్నారి 

  • బోరుబావిలో పది రోజులు..
  • రాజస్థాన్‌‌లో ఘటన

జైపూర్: రాజస్థాన్‌‌లోని కోట్‌‌పుత్లీలో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేండ్ల బాలిక చేతన కథ విషాదాంతమైంది. చిన్నారిని కాపాడేందుకు 10 రోజులుగా అధికారులు చేసిన శ్రమంతా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు బుధవారం బోరుబావిలోంచి చిన్నారిని బయటకు తీసిన అధికారులు..హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేతనను పరీక్షించిన డాక్టర్లు..చిన్నారి మృతి చెందినట్లు కన్ఫామ్ చేశారు. కోట్‌‌పుత్లీలోని కిరాత్‌‌పురా గ్రామానికి చెందిన మూడేండ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది.

అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ 7 00 అడుగుల లోతున్న బోర్‌‌వెల్‌‌లో పడిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి భారీ ఆపరేషన్ చేపట్టారు. తొలత పైపు ద్వారా బాలికకు ఆక్సిజన్ సప్లై చేశారు. అనంతరం బోర్‌‌వెల్‌‌కు సమాంతరంగా సొరంగం తవ్వగా.. అది రాంగ్ రూట్ లో వెళ్లింది. బాలిక కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాలతో పరీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ, 10 రోజులుగా ఆహారం, నీరు  లేకపోవడం..చలి తీవ్రత వల్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించి చేతన చనిపోయింది.

బోరుబావి నుంచి బయటకు తీసిన సమయంలోనే బాలికలో ఎటువంటి కదలికలు కనిపించలేదని ఎన్డీఆర్ఎఫ్ టీం ఇన్ చార్జ్ యోగేశ్ మీనా పేర్కొన్నారు. తన మనవరాలిని కాపాడటం కోసం  కఠినమైన చలిలో అవిశ్రాంతంగా కష్టపడిన అధికారులకు, రెస్క్యూ టీమ్‌‌లకు చేతన తాత దయారామ్ థ్యాంక్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్‌‌ బోర్‌‌వెల్‌‌లను మూసివేయాలని అధికారులను కోరారు.