మూడు రోజులుగా బోరు బావిలోనే చిన్నారి

  • రాజస్థాన్‌‌లో ఘటన

జైపూర్: రాజస్థాన్‌‌లోని కోట్‌‌పుత్లీ జిల్లాలో మూడేండ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సరండ్‌‌లోని కితార్‌‌పురాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బోర్‌‌వెల్‌‌లో నుంచి పాపను బయటకు తీసేందుకు 70 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌‌ కొనసాగు తున్నది. ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్, ఎస్‌‌డీఆర్‌‌ఎఫ్ టీమ్స్ తో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. కితార్‌‌పురాలోని మూడేండ్ల చెత్నా సోమవారం తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటలకు తండ్రి పొలం పనుల్లో ఉండగా చిన్నారి ఆడుకుంటూ  ప్రమాదవశాత్తు 700 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయింది. 

బాలిక మొదట 15 అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు రక్షించేందుకు యత్నించగా మరింత కిందకు జారుకుంది. ప్రస్తుతం పాప 150 అడుగుల లోతు వద్ద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్, ఎస్‌‌డీఆర్‌‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ సహాయక చర్యలు ప్రారంభించాయి. పైపుతో బోర్‌‌వెల్‌‌లోకి  ఆక్సిజన్ పంపిస్తున్నారు.