సాధువులపైకి  దూసుకొచ్చిన డీసీఎం .. ముగ్గురు మృతి

  • వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఘటన

పెబ్బేరు, వెలుగు: పాదయాత్ర చేస్తున్న సాధువులపైకి ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఎన్‌‌హెచ్‌‌ 44పై ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్‌‌కు చెందిన విజ్ఞాన్ ప్రజ్ఞా సూరజ్ మహరాజ్(గురువు), పునీత్ మహరాజ్ (50), ప్రియాంకర్ మహరాజ్, భగవాన్ భాయ్ (36), హేమల్ ప్రవీణ్ షా(52) మరో ఇద్దరు సాధువులు జైన మత ప్రచారం చేసుకుంటూ శనివారం రంగాపూర్‌‌‌‌కు చేరుకొని, రాత్రి అక్కడే బస చేశారు. 

ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో వారు కర్నూలు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద హైవేపై కర్నూలు వైపు వెళ్తున్న ఓ డీసీఎం అకస్మాత్తుగా సాధువులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో భగవాన్ భాయ్, హేమల్ ప్రవీణ్ షా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడ్డ వారిని జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పునీత్ మహారజ్ చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. డీసీఎం డ్రైవర్ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లీనర్ హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.