రైల్వే సిగ్నల్​ వ్యవస్థలో లోపం... రిపేర్​ చేస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రైన్​

రైల్వే సిగ్నల్​ వ్యవస్థలో లోపం... రిపేర్​ చేస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రైన్​

ముంబై డివిజ‌న్ ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవ‌స్థలో లోపం రావడంతో సరిచేస్తున్న రైల్వే  ఉద్యోగుల‌పై నుంచి లోక‌ల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు చనిపోయారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. 

మ‌హారాష్ట్ర పాలఘర్ జిల్లా ప‌రిధిలోని వాస‌యి రోడ్డు, నైగావ్ స్టేష‌న్ల మ‌ధ్య రైల్వే ట్రాక్​ పై  సిగ్నలింగ్ వ్యవ‌స్థలో లోపం తలెత్తింది. దాన్ని స‌రి చేసేందుకు ముగ్గురు ఉద్యోగులు సోమ‌వారం( జనవరి 22)  సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8:55 గంట‌ల స‌మ‌యంలో సిగ్నల్‌ను స‌రి చేస్తున్న వారిపై నుంచి చ‌ర్చ్‌గేట్ వైపు వెళ్తున్న లోక‌ల్ ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

మృతుల‌ను చీఫ్ సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్ వాసు మిత్ర, ఎల‌క్ట్రిక‌ల్ సిగ్నలింగ్ మెయింటైన‌ర్ సోమ‌నాథ్ ఉత్తమ్, హెల్పర్ స‌చిన్ వాంఖ‌డేగా పోలీసులు గుర్తించారు. త‌క్షణ సాయం కింద మృతుల కుటుంబాల‌కు రూ. 55 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టి, నివేదిక ఇవ్వాల‌ని ఉన్నతాధికారులు కోరారు.