వర్ని, వెలుగు : స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాంసాగర్ కాల్వలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం జరిగింది. చందూరుకు చెందిన మొండి విష్ణు (21) నిజామాబాద్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఫ్రెండ్స్‌తో కలిసి నిజాంసాగర్ కాల్వలో స్నానానికి వెళ్లాడు. కట్టమీది నుంచి కాల్వలోకి దూకడంతో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయాడు. గమనించిన ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమచారం ఇచ్చారు.
గజ ఈతగాళ్ళను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే వర్ని మండలం అఫందిఫారంకు చెందిన మోచి విజయ్ (50), తన అన్న కొడుకు మోచి నారాయణ (21)తో కలిసి స్నానానికి వెళ్లాడు. నారాయణ ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడ్డాడు. గమనించిన విజయ్ నారాయణను కాపాడే ప్రయత్నం చేయడంతో అతడు కూడా గల్లంతయ్యాడు. వర్ని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరిలో పడి యువకుడు మృతి
బాల్కొండ : దైవదర్శనానికి వచ్చిన తండ్రీకొడుకు, మేనల్లుడు గోదావరిలో దిగారు. ప్రమాదవశాత్తు కొడుకు, మేనల్లుడు నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన తండ్రి మేనల్లుడిని కాపాడాడు. కొడుకును కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద జరిగింది. మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లికి చెందిన మక్కల రెడ్డి పోచంపాడ్‌లో దైవదర్శనానికి కుటుంబ సభ్యులు వచ్చారు.
ముందుగా గోదావరిలో స్నానాలు చేసేందుకు మక్కల రెడ్డి, కొడుకు మహేశ్ (24), మేనల్లుడు దండుగుల శ్రీనివాస్ నదిలోకి దిగారు. మహేశ్, శ్రీనివాస్ నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన మక్కల రెడ్డి శ్రీనివాస్‌ను కాపాడాడు. కొడుకు మహేశ్‌ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీనివాస్ యాదవ్ గజ ఈతగాళ్లతో వచ్చి గాలింపు చేపట్టి మహేశ్ డెడ్‌బాడీని బయటకు తీశారు.
