ముగ్గురిని  బలి తీసుకున్న డెంగ్యూ

  •     తొర్రూరులో నాలుగేండ్ల చిన్నారి  
  •     నాగర్​కర్నూల్​, లింగంపేటల్లో  ఇద్దరు బీటెక్​ స్టూడెంట్స్​ మృతి 

తొర్రూరు/ నాగర్ కర్నూల్ టౌన్/ లింగంపేట వెలుగు : రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు ఆగడం లేదు. మానుకోట, నాగర్​కర్నూల్​ , కామారెడ్డి జిల్లాల్లో ముగ్గురు డెంగ్యూ బారిన పడి కన్నుమూశారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరుకు చెందిన గూబ అశోక్, అమల చిన్న బిడ్డ ఆద్విక (4)కు నాలుగు  రోజుల కిత్రం తీవ్ర జ్వరం రావడంతో వరంగల్​లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు.

 ప్లేట్​లెట్స్​ తగ్గి పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. తొర్రూరు ఆద్వికకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఉందని, దీంతో పాటు డెంగ్యూ రావడంతో చనిపోయిందని పీహెచ్​సీ డాక్టర్లు తెలిపారు.  

ఇంజినీరింగ్ ​విద్యార్థిని.. 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ బారిన పడిన ఓ బీటెక్ స్టూడెంట్​పది రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. నాగర్ కర్నూల్ కు చెందిన మిర్యాల శ్రీనివాసులు రెండో బిడ్డ నికిత(21) హైదరాబాద్​లోని మల్లారెడ్డి వర్సిటీలో బీటెక్ చదువుతోంది. నెల క్రితం సెలవులపై ఇంటికి రాగా అస్వస్థతకు గురైంది. పది రోజుల కింద ప్లేట్​లెట్స్​తగ్గడంతో డెంగ్యూ లక్షణాలున్నట్లు గుర్తించి హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్​లో చేర్పించారు.

పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయింది. 10 రోజుల ట్రీట్​మెంట్​కు  రూ.12 లక్షలకు పైగా ఖర్చయ్యిందని, అయినా ప్రాణం దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, డెంగ్యూ సోకిన తర్వాతే నికిత నాగర్ కర్నూల్​కు వచ్చిందని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు. 

తల్లిదండ్రుల నిర్లక్ష్యం...ఆర్ఎంపీ వైద్యంతో..

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బాయంపల్లి తండాలో కొడుకుకు డెంగ్యూ సోకగా తల్లిదండ్రులు ట్రీట్​మెంట్ పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్లి కాలయాపన చేయడంతో  చనిపోయాడు. తండాకు చెందిన సబావట్​చౌహాన్​పీరేందర్​(21) ఖమ్మంలో బీటెక్​సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కోసం శుక్రవారం తండాకు రాగా జ్వరం వచ్చింది. దీంతో ఇతడి తండ్రి సోమవారం లింగంపేటలో ఓ ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆయన కామారెడ్డి హాస్పిటల్​కు తీసుకపోవాలని సూచించగా వినకుండా మండల కేంద్రంలోని మరో ఆర్ఎంపీ దగ్గరకు పట్టుకుపోయాడు.

అతడు కూడా కామారెడ్డి వెళ్లాలని చెప్పినా వినలేదు. మళ్లీ మండల కేంద్రంలోని మరో ఆర్ఎంపీ దగ్గరకు తీసుకుపోయాడు. ఆయన టెస్టులు చేయించగా డెంగ్యూ వచ్చినట్టు తేలింది. ట్రీట్​మెంట్ ​మొదలుపెట్టగా అర్ధరాత్రి పీరేందర్​ఆరోగ్యం విషమించింది. దీంతో తనతో కాదని కామారెడ్డికి తీసుకుపోవాలని చెప్పాడు. వెంటనే ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా వారు హైదరాబాద్ ​రెఫర్ ​చేశారు. హైదరాబాద్​తరలిస్తుండగా పీరేందర్​చనిపోయాడు. కాగా, ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని, వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి కుమార్ ​డిమాండ్​  చేశాడు. 

టైఫాయిడ్​తో ప్లేట్​లెట్స్​ తగ్గి...

మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరులో టైపాయిడ్​తో మూడేండ్ల బాలు డు చనిపోయాడు. రామ కోటి, సౌమ్య కొడుకు దాసు హర్షవర్ధన్(3)కు నాలుగు రోజుల కింద జ్వరం రాగా, మేళ్లచెరువులోని ఆర్ఎంపీ దగ్గర రెండు రోజులు ట్రీట్​మెంట్​ఇప్పించారు. అయినా తగ్గకపోవడంతో కోదాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. బ్లడ్​ టెస్ట్ ​చేయించగా టైఫాయిడ్​ అని తేలింది. ప్లేట్​లెట్స్​తగ్గిపోవడంతో హైదరాబాద్ తరలిస్తుండగా చనిపోయాడు.