భార్యతో కలహాలు.. అభం శుభం తెలియని చిన్నారులను చెరువులోకి తోసేసిన తండ్రి

సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసి.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. అశ్వన్ నందన్(7), త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఆర్థిక కష్టాలు చిచ్చు పెట్టాయి. కొన్నినెలల కిందట భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. శిరీష భర్త, పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. 

భర్త సత్యం.. పలు మార్లు ఆమెను కాపురానికి రావాలని కోరినా.. కనికరించలేదు. దాంతో, మనోవేధనకు గురైన ఆయన ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఒక్కడిని ఏదైనా చేసుకుంటే, పిల్లలు అనాధలవుతారని భావించిన ఆయన.. తన ఇద్దరు పిల్లలు అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

చూసి కూడా కాపాడని స్థానికులు

సత్యం మొదట తన పిల్లలను చెరువులోకి తోసేసి.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. వారు చెరువులో దూకడాన్ని కళ్లారా చూసిన స్థానికులు.. విలువైన సమయాన్ని వృధా చేశారు. పోలీసులకు సమాచారం అందించి.. ఎవరు దూకాలనేది నిర్ణయించుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.