ముకర్లాబాద్​లో గుర్రాల హల్ చల్.. మూడు రోజుల్లో ముగ్గురిపై దాడి

గండీడ్, వెలుగు : మహమ్మదాబాద్  మండలంలోని ముకర్లాబాద్ లో గుర్రాలు హల్​చల్  చేస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన మూడు గుర్రాలు మూడు రోజులుగా ఊరితో పాటు పంట పొలాల్లో తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో పిల్లలు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కింద అరవింద్  అనే యువకుడు జొన్న చొప్ప మేస్తున్న గుర్రాలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా, తీవ్రంగా గాయపర్చాయి.  ప్రస్తుతం అతడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లింగాయపల్లి, కనికెలకుంట తండాకు చెందిన ఇద్దరిపై కూడా దాడి చేశాయి.

పక్కనే ఉన్నవారు వాటిని బెదిరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పొలాల్లో తిరుగుతున్న వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తున్నాయని వాపోతున్నారు. గల్లీల్లో తిరుగుతుండడంతో ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు చెబితే తమకు సంబంధం లేదని చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా గుర్రాలను ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.