బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌ జిల్లాల్లో 2020, నవంబర్ 26వ తేదీన కుండపోత వర్షం కురిసింది. దీంతో బుధవారం (2024, నవంబర్ 27) ఈ మూడు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నాగపట్నం జిల్లాలోనూ భీకర వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. 

వాయుగుండం ప్రభావంతో మరో 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ చెన్నైతో పాటు 12  తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పుదుచ్చేరిలోని కారైకాల్‌లోనూ వెదర్ డిపార్ట్మెంట్ రెడ్‌ అలర్ట్‌ ఇష్యూ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయు గుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడింది. 

ALSO READ | తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

వాయు గుండం ఎఫెక్ట్‎తో రానున్న రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులను వేటకు వెళ్లొద్దని సూచించిన అధికారులు.. తీరంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహయక బృందాలను అప్రమత్తం చేసింది. 

కాగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర వాయు గుండం మారింది. గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 280 కి.మీ.. తమిళనాడు రాజధాని చెన్నైకి 770 కి.మీ దూరంలో వాయు గుండం కేంద్రీకృతమై ఉంది. ఈ వాయు గుండం బుధవారం (2024, నవంబర్ 27) తుఫాన్‎గా బలపడి పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్‎కు అధికారులు ఫెంగల్‎గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.