ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ డిప్యూటీ సీఎం పేషీకి ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ.. మెసేజులు పంపినట్లు తెలుస్తోంది.పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు సిబ్బంది.
ALSO READ | మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో సందడి చేసిన సీఎం, డిప్యూటీ సీఎం...
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు డిప్యూటీ సీఎం పేషీ సిబ్బంది. పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావటం పట్ల జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతకు భద్రత పెంచాలని కోరుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఇది ఆకతాయిల చర్యనా లేక పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్రమాదం పొంచి ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావటం, వార్నింగ్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు. సనాతన ధర్మం విషయంలో ఆయన ఉద్యమించినప్పుడు.. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా.. బీజేపీ తరపున ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ భద్రత విషయంలో ఆందోళన నెలకొంది పోలీసులకు. ఆయనకు భద్రత పెంచాలని నిర్ణయించింది. అయితే ఎంత భద్రత పెంచుతారు.. ఎలాంటి భద్రత ఇవ్వనున్నారు అనేది పోలీస్ శాఖ పరిశీలిస్తుంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి.. బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు దిశగా అడుగులేస్తుండటం.. స్వయంగా కాకినాడ పోర్టుకి వెళ్లి షిప్ ని సీజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావడం వెనక రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.