IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఇటలీ ప్లేయర్.. ఎవరీ థామస్ డ్రాకా..?

ఇటాలియన్ క్రికెటర్ థామస్ జాక్ డ్రాకా నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం కోసం అధికారికంగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో జాక్ డ్రాకా అమ్ముడుపోతే ఐపీఎల్ ఆడబోయే తొలి ఇటాలియన్ ప్లేయర్ గా నిలుస్తాడు. ఈ ఏడాది ప్రారంభంలో డ్రాకా.. ఇటలీ తరపున లక్సెంబర్గ్‌తో జరిగిన టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్ గా  నాలుగు మ్యాచ్‌ల్లో 8.50 సగటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ టీ20ల్లో ఓవర్‌కు 4.25 పరుగులే ఉండడం విశేషం.  

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బ్రాంప్టన్ వోల్వ్స్ తరపున డ్రాకా ఆడాడు. గ్లోబల్ టీ20 లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లలో కేవలం 10.63 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 6.88 పరుగులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యూఏఈ ఇంటెర్నేషనల్ లీగ్ లో ఆడిన అనుభవం కూడా ఈ ఇటలీ ఫాస్ట్ బౌలర్ కు ఉంది. ఏ జట్టు ఈ ఇటలీ పేసర్ పై ఆసక్తి చూపుతుందో ఆసక్తికరంగా మారింది. 

వేలంలో మొత్తం 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు కాగా.. మిగిలిన 409 మంది ఓవర్సీస్(విదేశీ) ప్లేయర్లు. ఇందులో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు.. 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను వెల్లడించాయి. మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోగా, ఇందులో పది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిపై అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.558.5 కోట్లు ఖర్చు చేశాయి.