మన లైఫ్ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. స్పోర్ట్స్ బైక్‌పై హండ్రెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తూ ఎంజాయ్ చేసినవాడు కదల్లేని స్థితిలో బెడ్‌కే పరిమితం కావడానికి ఓ చిన్న యాక్సిడెంట్ చాలు. కనీసం సొంతంగా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి దాపురించినప్పుడు జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఇతరుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన పుట్టుకొస్తుంది.
కాలు కూడా కదల్చలేని స్థితిలో ఉన్నవారు టాయిలెట్‌కు వెళ్లడం ఎంత కష్టమో అది అనుభవించినవారికే తెలుస్తుంది. తీరా వెళ్లాక బాత్రూమ్లో పడే అవస్తలు అన్నీఇన్నీ కావు. ఆ నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తే భువనేశ్వర్‌కు చెందిన దుర్గాప్రసాద్. తాను పడ్డ కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఓ కొత్త వీల్ చెయిర్ తయారీకి కారణమయ్యాడు. అదే ఫోల్డబుల్, పోర్టబుల్ కన్వర్టబుల్, బాత్రూమ్ కంపాటబుల్ వీల్‌చైర్.
యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరి సాయం లేకుండా తన అవసరాలు తానే తీర్చుకునేందుకు వీల్‌చెయిర్ కోసం నెట్లో వెతికాడు. ఎన్నోరకాల వీల్ చెయిర్లు మార్కెట్లో ఉన్నా అవేవీ తన సమస్యకు పరిష్కారం చూపేలా కనిపించలేదు. సరిగ్గా అప్పుడే ‘ఫ్రిడో’ అనే స్టార్టప్ గురించి చదివాడు. రకరకాల వీల్చైర్లను ప్రయోగాత్మకంగా తయారుచేస్తున్న ఫ్రిడో కంపెనీని కాంటాక్ట్ అయ్యాడు. దాదాపు ఏడు నెలలపాటు తాను పడుతున్న కష్టాన్ని, బాత్రూమ్లో పడుతున్న ఇబ్బందిని వారికి వివరించాడు. తన కోసం ప్రత్యేకంగా ఓ వీల్ చెయిర్‌ను తయారు చేయమని కోరాడు.
ఫ్రిడో అనే ఈ స్టార్టప్‌ను కోజికోడ్ ఎన్ఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు ప్రారంభించారు. కాలేజీలో చదివే రోజుల్లోనే ఎన్నో కొత్త కొత్త పరికరాలను తయారు చేసిన గణేశ్, లక్ష్మీకాంత్, కునాల్, దేవ్రాజ్లు.. చదువు ముగిసిన తర్వాత ఫ్రిడోను ప్రారంభించారు. దుర్గాప్రసాద్ నుంచి వచ్చిన మెయిల్స్‌ను, వీడియోలను చూసి ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్ల కోసం ఓ వీల్ చెయిర్‌ను డిజైన్ చేశారు. దానిని దుర్గాప్రసాద్‌కు పంపి, పరీక్షించమన్నారు. ఆయన చేసిన మరికొన్ని సూచనలతో ‘ఆర్కాట్రన్’ పేరుతో వీల్‌చైర్‌ను సిద్ధం చేశారు.
చూడ్డానికి సాధారణ వీల్చైర్లాగే కనిపించే ఆర్కాట్రన్ వీల్‌చైర్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అతితక్కువ బరువుండేలా తేలికైన లోహాలతో దీనిని రూపొందించారు. ఫోల్డ్ అయ్యేలా తయారు చేసినందున దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా ఈజీ. అంతేకాకుండా బాత్రూమ్లో కమోడ్పైనా సెట్ అవుతుంది. ఎవరి సాయం లేకుండా బెడ్‌పై పడుకోవడానికి హైట్‌ను కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఓ చోట కదలకుండా ఉండాలనుకున్నప్పుడు లాక్ చేసుకోవచ్చు. నెక్ రెస్ట్ కోసం, బ్యాక్‌బోన్ సపోర్ట్ కోసం కూడా ఎక్స్ట్రా ఫిటింగ్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎటైనా ప్రయాణమవుతున్నప్పుడు ఈ వీల్‌చైర్ మొత్తం ఓ సూట్‌కేస్‌లా మారిపోతుంది. దాన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్న ఈ వీల్‌చైర్‌ను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వీల్చైర్ల కంటే తక్కువ ధరకే అమ్మేందుకు ఫ్రిడో ప్రయత్నిస్తోంది. అయితే పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తేనే అది సాధ్యమవుతుందంటున్నారు స్టార్టప్ ప్రతినిధులు. ప్రస్తుతం 9,500 రూపాయలకు ఈ వీల్ చెయిర్‌ను విక్రయిస్తున్నారు. అదనంగా సదుపాయాలు కావాలనుకుంటే 36 వేల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. https://arcatron.com వెబ్సైట్ నుంచి లేదా ఈ–కామర్స్ సంస్థలు కూడా ఆన్లైన్లో ఈ వీల్ చెయిర్లను అమ్ముతున్నాయి.
నలుగురు స్టూడెంట్లు రూపొందించిన ఆర్కాట్రన్ వీల్‌చైర్‌కు ఎన్నో గుర్తింపులు దక్కాయి. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘సన్–సధన్ హ్యాకథాన్ 2017’ గుర్తింపుతోపాటు నీతి ఆయోగ్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండే షన్, 91 స్ప్రింగ్ బోర్డ్ నుంచి కూడా గుర్తింపు దక్కింది. 2016లో గూగుల్ నిర్వహించిన ‘సర్జ్ కాన్ఫరెన్స్’లో 400 మంది పార్టిసిపెంట్స్‌తో పోటీ పడి ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. జాతీయస్థాయి వీల్‌చైర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరవణ కుమార్ కోసం ఓ వీల్‌చైర్ తయారుచేసే అవకాశం కూడా ఈ స్టార్టప్ కంపెనీకే దక్కింది. ప్రస్తుతం భారతదేశంలోనే 1500 మంది ఈ వీల్‌చైర్‌ను ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్, యూకే, కెనడా, లగ్జెంబర్గ్ తదితర దేశాల్లో కూడా వేలాది మంది ఫ్రిడో కంపెనీ వీల్చైర్లను ఉపయోగిస్తున్నారు.

