స్టార్టప్: చెత్తతో కొత్తగా.. పేవర్ బ్లాక్స్

సిటీల్లోని ఏ గల్లీలో చూసినా ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపిస్తుంటుంది. పారే నదుల నుంచి మొదలుపెడితే.. సముద్ర గర్భం వరకు ప్లాస్టిక్​ నిండిపోయింది. ఏ సముద్ర తీరాన చూసినా వ్యర్థాలే.  వాటిని చూసిన వాళ్లంతా ‘పొల్యూషన్​ పెరిగిపోతోంది మనమేం చేయగలం’ అనుకుని వెళ్లిపోతుంటారు. వీళ్లు మాత్రం ఒక క్షణం ఆగి ఆలోచించారు. ‘డంప్ ఇన్ బిన్’ అనే స్టార్టప్​ పెట్టి ఆ చెత్తతో రకరకాల రీసైకిల్​ ప్రొడక్ట్స్​ తయారుచేస్తున్నారు. 

రిషబ్, నితిన్.. కాలేజీ ఫ్రెండ్స్. వాళ్లకు వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమ గురించి బాగా తెలుసు. ఎందుకంటే.. వాళ్ల కాలేజీలో  నిర్వహించిన ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్‌లో వాటి గురించి తెలుసుకున్నారు. చదువు పూర్తైన తర్వాత రిషబ్ రీసెర్చ్ అసోసియేట్ అండ్​ ప్రాజెక్ట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించాడు. కొన్ని నెలలపాటు కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం చేశాడు. కానీ.. తర్వాత అతనికి ఆ పని నచ్చలేదు. కొన్నాళ్లు బ్రేక్​ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా 2016లో ఉద్యోగం మానేశాడు. సొంతూరు గుర్​గ్రామ్​​కు వెళ్లేటప్పుడు  అతని జీవితంలో ‘యురేకా మూమెంట్’​ ఎదురైంది.

అదేంటంటే.. అతను కారులో వెళ్తుంటే.. ఢిల్లీ–జైపూర్ హైవేలో చాలా పేపర్ వ్యర్థాలు రోడ్డుపై ఎగురుతూ కనిపించాయి. అందరిలానే ‘బహుశా పక్కనే ఏదైనా ఫంక్షన్ జరిగిందేమో. మన దగ్గర ఇలాంటివి కొత్తేమీ కాదు. ఈ పరిస్థితులు మారవు’ అనుకున్నాడు. కానీ.. మరుక్షణమే.. ‘నేనూ అందరిలాగే మిగతావాళ్లను ఎందుకు విమర్శించాలి? దానికి బదులు ఏదైనా సొల్యూషన్​ వెతకాలి’ అనుకున్నాడు. 

సొల్యూషన్​ 

సొల్యూషన్​ వెతకాలనే ఆలోచన వచ్చిన వెంటనే రిషబ్ నితిన్‌కి ఫోన్​ చేశాడు. చెత్త రీసైకిల్​ ఆలోచన చెప్పగానే నితిన్​ కూడా అతనితో చేరాడు. ఇద్దరూ కలిసి రీసెర్చ్​ చేయడం మొదలుపెట్టారు. చాలారోజులు డంప్‌యార్డులు, చెత్త కుప్పల చుట్టూ తిరిగారు. అప్పుడు చెత్తలో ప్లాస్టికే అత్యంత ప్రమాదకరమైందని తెలుసుకున్నారు. దాన్ని  కాల్చేసినా, అలాగే వదిలేసినా పర్యావరణానికి ప్రమాదమే. అందుకే దాన్ని రీసైకిల్​ చేసి ఏదైనా కొత్త రకం ప్రొడక్ట్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఇద్దరూ కలిసి 2017లో ‘డంప్ ఇన్ బిన్’ పేరుతో స్టార్టప్​ కంపెనీ రిజిస్టర్​ చేసుకున్నారు. 

బాధ్యతగా.. 

ఇది రిషబ్​, నితిన్​లకు కేవలం వ్యాపారం మాత్రమే కాదు. వాళ్లు దీన్ని ఒక బాధ్యతగా తీసుకున్నారు. అందుకే వాళ్లకు అండగా చాలామంది నిలుస్తున్నారు. గురుగ్రామ్​​లో ఉంటున్న పర్ణికా శ్రీమాలి తన ఇంట్లోని ప్లాస్టిక్​ వేస్ట్‌‌‌‌ని రెగ్యులర్​గా డస్ట్‌‌బిన్​లో వేసేది. కానీ.. ఈ కంపెనీ గురించి తెలుసుకుని రిషబ్​ని కలిసింది. వాళ్ల అపార్ట్‌‌మెంట్‌‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రిషబ్​కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ‘‘మేము చెత్త సేకరించడానికి పర్ణిక వాళ్ల అపార్ట్​మెంట్​కు వెళ్లాం. అక్కడ చాలా తక్కువ మొత్తంలో ప్లాస్టిక్​ ఉంది. అంత తక్కువ చెత్త తీసుకెళ్తే.. పెద్దగా లాభం ఉండదు. అయినా.. మేం చెత్త తీసుకెళ్తే..  ఆ అపార్ట్​మెంట్​లోని ప్రతి ఒక్కరికీ ప్లాస్టిక్​ రీసైకిల్​ మీద అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నష్టాన్ని కూడా భరించాం. ఇప్పటికీ ఆ అపార్ట్‌‌మెంట్ కాంప్లెక్స్ నుంచి ‘డంప్ ఇన్ బిన్’కు ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి” అంటూ తన ఎక్స్​పీరియెన్స్​ని పంచుకున్నాడు రిషబ్.

ట్రయల్ అండ్​ ఎర్రర్స్​

కంపెనీ పెట్టిన తర్వాత రిషబ్, నితిన్​ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చెత్త సేకరించేవాళ్ల దగ్గరకు వెళ్లారు. దాదాపు 15–20 మంది నుంచి ప్లాస్టిక్​ వేస్ట్‌‌ని కొనడం మొదలుపెట్టారు. దాంతో రకరకాల ప్రొడక్ట్స్​ తయారుచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అలా కొన్ని ట్రయల్స్​ అండ్ ఎర్రర్స్​​ తర్వాత ప్లాస్టిక్ రీసైక్లింగ్ మీద ఒక అవగాహనకు వచ్చారు. మొదట్లో ప్లాస్టిక్​ని పాన్​లో వేసి కరిగించడం లాంటి ప్రయోగాలు కూడా చేశారు. కానీ.. ప్లాస్టిక్‌‌ను రీసైక్లింగ్ చేయడం అంత ఈజీ కాదని వాళ్లకు అర్థమైంది. ఎందుకంటే.. అన్ని రకాల ప్లాస్టిక్​లను ఒకచోట కలపడం కుదరదు.

వివిధ గ్రేడ్ల ప్లాస్టిక్‌‌ను విడిగా ప్రాసెస్ చేయాలి. కార్ల విడిభాగాల తయారీకి హై–గ్రేడ్ ప్లాస్టిక్‌‌ను వాడతారు. అందుకే ఆటోమోటివ్ తయారీదారుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలనుతీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే.. హై క్వాలిటీ ప్రొడక్ట్స్​ తయారు చేయొచ్చు అనుకున్నారు. కానీ.. రీసైకిల్ ప్లాస్టిక్‌‌ని ఫుడ్​ ప్యాకేజింగ్‌‌ లాంటి వాటికోసం వాడకూడదనిగట్టి నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరహా మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలకు(ఎస్​ఎంఈ) అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులను తక్కువ ధరలో తయారు చేస్తున్నారు. అలా ఇప్పటివరకు కొన్ని లక్షల కిలోల ప్లాస్టిక్‌‌ను రీసైకిల్ చేశారు. దానిద్వారా ప్రతి నెలా 10 లక్షలకుపైగా ఆదాయం సంపాదిస్తున్నారు. 

నిర్మాణ రంగంలోకి.. 

రిషబ్, నితిన్ అక్కడితో ఆగిపోవాలి అనుకోలేదు. వ్యర్థాల సమస్యను పూర్తిగా పరిష్కరించాలి అనుకున్నారు. అత్యంత కార్బన్–ఇంటెన్సివ్ మెటీరియల్స్​లో ఒకటైన సిమెంట్‌‌కు బదులుగా వాడగలిగే కొత్త ప్రొడక్ట్‌‌ని సృష్టించే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం.. 2022లో గ్లోబల్ సిమెంట్ పరిశ్రమ 1.6 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్​ని ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచంలోని మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో  8శాతం.

దీనివల్ల భవిష్యత్తులో వాతావరణంలో చాలా మార్పులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సిమెంట్‌‌ వాడకాన్ని తగ్గించే ప్రొడక్ట్‌‌ని తయారు చేయాలి అనుకున్నారు. అందులో భాగంగానే దాదాపు రెండు సంవత్సరాల పరిశోధన తర్వాత వాళ్లు పీఎల్​ఏవీఈ పేరుతో ఒక ప్రొడక్ట్‌‌ తయారుచేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, బిల్డింగ్స్​ కూల్చివేత శిథిలాల మిశ్రమంతో దీన్ని చేశారు. దాంతో.. ఫుట్​పాత్​ల మీద పార్కింగ్​ ప్లేస్‌‌ల్లో వేసే పేవర్​​ బ్లాక్స్​ని తయారుచేస్తున్నారు. అవి సిమెంట్​తో తయారుచేసేవాటితో పోలిస్తే.. చాలా స్ట్రాంగ్​గా ఉంటాయి. పైగా వీటికి వర్షపు నీటిని పీల్చుకుని భూమిలోకి ఇంకేలా చేసే గుణం ఉంది. అంతేకాదు.. ఈ బ్లాక్స్​ 130 సెంటిగ్రేడ్ల టెంపరేచర్​ని కూడా తట్టుకుంటాయి.