IND vs BAN: ఇది భారత జట్టు కాదు.. ఐపీఎల్ టీమ్: పాక్ మాజీ క్రికెటర్

గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోరుకే క‌ట్ట‌డి చేసిన భార‌త ఆటగాళ్లు.. అనంతరం ల‌క్ష్యాన్ని 11.5 ఓవ‌ర్ల‌లోనే ఛేదించారు. హార్దిక్ పాండ్యా(39 నాటౌట్), సంజూ శాంస‌న్(29), సూర్య‌కుమార్ యాద‌వ్(29)లు బంగ్లాదేశ్ బౌలర్ల‌ను ఉతికేస్తూ బండ‌రీల మోత మోగించారు. ఈ గెలుపుపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ భారత యువ జట్టును ఆకాశానికెత్తేశాడు. 

ALSO READ | ENG vs PAK 1st Test: ఇది పిచ్ ఏంట్రా.. తారు రోడ్డు: ఇంగ్లండ్ - పాక్ తొలి టెస్టుపై నెట్టింట జోకులు

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అప్పటి బంగ్లా జట్టు.. ఇప్పటి జట్టు ఒకలా లేవని బసిత్ అలీ పేర్కొన్నాడు. భారత జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లా జట్టుపై టెస్టు సిరీస్‌ ఓడిన పాక్‌ను ఏమనాలో కూడా తెలియడం లేదని వ్యాఖ్యానించాడు.

భారత జట్టు కాదు.. ఐపీఎల్ టీమ్

గ్వాలియర్‏లో బంగ్లాదేశ్‌ను ఓడించింది భారత సీనియర్‌ జట్టు కాదు.. ఐపీఎల్‌లో ఒక టీమ్. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్ పంత్,  అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ వంటి స్టార్ ప్లేయర్లూ ఇక్కడ లేరు. అంతా యువకులే. అయినప్పటికీ, భారత్ బలంగా ఉంది. ఈ టీమ్‌కు తదుపరి మ్యాచ్‌ల్లోనూ బంగ్లా ఏమాత్రం పోటీ ఇవ్వలేదనేది వాస్తవం. ఇక రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంటే.. మూడో టీ20లో రిజర్వ్‌బెంచ్‌ ప్లేయర్లతో బరిలోకి దిగుతారు. అలా చేసినప్పటికీ వారిదే విజయం. బంగ్లా జట్టును చూస్తుంటే సొంతగడ్డపై మమ్మల్ని(పాకిస్థాన్) వైట్‌వాష్‌ చేసిన జట్టు ఇదేనా? అనిపిస్తోంది. వీరి చేతిలో ఓడిన మా జట్టును ఏమనాలో కూడా తెలియడం లేదు.." అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు.

కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో యువ పేసర్ మయాంక్ యాదవ్‌, తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి భారత జట్టు తరుపున అరంగేట్రం చేశారు.