ఐస్ క్రీం ప్రియుల కోసం అని అన్ని షాప్ ఐస్ క్రీం ఓనర్స్ చెప్తారు. కానీ ఓ ఐస్ క్రీం పార్లర్ యజమాని మాత్రం ఆ పదాలను నిరూపిస్తూ ఈ వేడి పుట్టించే సమ్మర్ లో చల్లని ఐసీ క్రీంలను అందిస్తున్నారు. కేవలం రూ.2కే పలు రకాల కోన్ ఐస్ క్రీంలను అమ్ముతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే...
1995లో తన తండ్రి ఐస్ క్రీం బిజినెస్ ను ప్రారంభించి.. కేవలం రూ.1 కే కోన్ ఐస్ క్రీం అనే ఆఫర్ కు తెరలేపారని చెన్నైకి చెందిన వినోద్ తెలిపారు. ఆ తర్వాత 2008 నుంచి ఒక రూపాయి పెంచి ఒక్కో ఐస్ క్రీం కోన్ కు రూ.2గా ఫిక్స్ చేశారన్నారు. అనంతరం లేబర్ ఇష్యూస్ వల్ల ఆ షాప్ ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అలా మూత పడిన బిజినెస్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో వినోద్ మళ్లీ ప్రారంభించానని చెప్పుకొచ్చారు. కానీ ఐస్ క్రీం ధరను పెంచడానికి మాత్రం తనకు మనసు రాలేదని అన్నారు.
అలా వినోద్ తమ పాత కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఒకప్పటి ధరనే స్థిరంగా ఉంచి పాపులర్ అయ్యారు. తమిళనాడులోని పశ్చిమ మాంబలంలో వినూ ఇగ్లూ పేరిట తెరిచిన ఐస్ క్రీం పార్లర్ కి... ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర్నుంచి సీనియర్ సిటిజన్స్ వరకూ క్యూలైన్లు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. రూ.2ల ఐస్ క్రీం షాప్ గా పిల్లలు పిలుచుకునే ఈ దుకాణంలో వెనీలా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, పిస్తా లాంటి ఎన్నో రకాల ఐస్ క్రీంలు అందుబాటులో ఉన్నాయి.
ఏం లాభం లేదు.. కానీ..
"నిజం చెప్పాలంటే రూ.2కే ఐస్ క్రీం అమ్మడం వల్ల నాకు ఎలాంటి లాభమూ రాదు. కానీ అలా విక్రయించడానికి ముఖ్య కారణమేమిటంటే.. కస్టమర్‌లు ఐస్‌క్రీమ్ ఒక్కటే తీసుకోరు కదా. దానితో పాటు కేక్ లేదా ఐస్‌క్రీమ్‌తో కూడిన బ్రౌనీ లేదా పాలకోవా (మిల్క్ మావా) ఐస్‌క్రీమ్ వంటి అధిక ధర కలిగిన ఐటెమ్స్ ను కూడా తీసుకుంటారు. అలా నా సంపాదనను పెంచుకుంటాను".
- వినోద్
ఐస్ క్రీం పార్లర్ యజమాని
వినోద్ ఇలా తక్కువ ధరకే ఐస్ క్రీంలు అమ్మడం వల్ల నాణ్యత విషయంలో చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నప్పటికీ.. తాను మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. మామూలుగా ఐస్ క్రీంను పాలు, నీళ్లు కలిపి తయారు చేస్తారు. కానీ తాము మాత్రం ఓన్లీ పాలను మాత్రమే కలిపి తయారు చేస్తామని వినోద్ చెప్పారు. బయట రూ.20కు అమ్మే ఐస్ క్రీంలో ఉండే క్వాలిటీ తమ దగ్గర రూ.2కే దొరుకుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం...
