- ప్రీమియం రేట్లను పెంచిన ప్రభుత్వం
- వచ్చే నెల 1 నుంచి అమల్లోకి
- ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్‌కు డిస్కౌంట్
న్యూఢిల్లీ : కార్లు, బైక్‌ల ఓనర్లపై వెహికల్ ఇన్సూరెన్స్ భారం మరింత పెరగనుంది. థర్డ్ పార్టీ (టీపీ) ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను సవరిస్తూ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సవరించిన రేట్లు వచ్చే నెల 1 నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా, వెహికల్ ఓనర్లు ఎవరినైనా గుద్దినా, ప్రాపర్టీలను డ్యామేజ్ చేసినా ఆ గుద్దిన వారికి (లేదా ప్రాపర్టీ డ్యామేజ్ ఖర్చులను) థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే వెహికల్ ఓనర్లకు తప్ప వెహికల్ వలన ఇతరులకు కలిగే నష్టాన్ని ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. కరోనా వలన రెండేళ్ల పాటు టీపీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభుత్వం పెంచకుండా ఉంచింది. తాజాగా ప్రీమియం రేట్లను పెంచడంతో 1,000 సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కారుపై తీసుకునే టీపీ ఇన్సూరెన్స్ రూ. 2,094కి పెరిగింది. 2019–20లో ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 2,072 గా ఉండేది. అదే విధంగా 1,000 సీసీ నుంచి 1,500 సీసీ మధ్య ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లపై ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 3,221 నుంచి రూ. 3,416 కి పెరిగింది. కానీ, 1,500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లపై మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వం కొద్దిగా తగ్గించింది. ఇటువంటి కార్లపై 2019–20లో టీపీ ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ. 7,897 వసూలు చేయగా, ఈ రేటును రూ. 7,890 కి తగ్గించారు.
టూవీలర్ ఓనర్లకూ తప్పని భారం
టూ వీలర్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ప్రభుత్వం పెంచింది. 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య ఇంజిన్ కెపాసిటీ ఉన్న టూవీలర్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను రూ. 1,366కి పెంచారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉంటే ప్రీమియం కింద రూ. 2,804 చెల్లించాల్సిందే. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకటిస్తుంది. ఈ సారి మాత్రం ఐఆర్‌డీఏఐ సహకారంతో ప్రభుత్వం ప్రకటించింది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై తీసుకునే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను ప్రభుత్వం 7.5 శాతం మేర తగ్గించడం విశేషం.
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇలా
బ్యాటరీ కెపాసిటీ 30 కిలో వాట్స్ కంటే తక్కువగా ఉన్న ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లపై టీపీ ఇన్సూరెన్స్ ప్రీమియంను రూ. 1,780 గా ప్రభుత్వం నిర్ణయించింది. 30 నుంచి 65 కిలో వాట్స్ మధ్య ఉంటే రూ. 2,904 ను టీపీ ప్రీమియంగా వసూలు చేస్తారు. అదేవిధంగా కమర్షియల్ వెహికల్స్‌పై టీపీ ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా ప్రభుత్వం పెంచింది. 12 వేల నుంచి 20 వేల కేజీల మధ్య వెయిట్‌ను మోయగలిగే కమర్షియల్ వెహికల్స్‌పై ఇన్సూరెన్స్ ప్రీమియంను రూ. 35,313కి పెంచారు. 2019–20 లో ఈ రేటు రూ. 33,414 గా ఉంది. 40 వేల కేజీల కంటే ఎక్కువ వెయిట్‌ను మోయగలిగే వెహికల్స్‌పై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను రూ. 41,561 నుంచి రూ. 44,242 కి పెంచారు. విద్యా సంస్థలు వాడే బస్సులపై 15 శాతం డిస్కౌంట్‌ను ఇచ్చారు. వింటేజ్(పాత) కార్లుగా రిజిస్టర్ అయిన ప్రైవేట్ కార్లపై టీపీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 50 శాతం మేర తగ్గించారు.
మరిన్ని వార్తల కోసం : -
ఈఎస్ఐకి మార్చిలో 14.05 లక్షల కొత్త మెంబర్లు
2న కియా ఎలక్ట్రిక్ కారు విడుదల.. మొదలైన బుకింగ్స్
