రోడ్​ కబ్జాపై గ్రామస్తుల ఆందోళన

నవాబుపేట, వెలుగు: ఓ ప్రైవేట్​ వ్యక్తి తన వెంచర్​ కాంపౌండ్​ వాల్​ కోసం నక్షా రోడ్​ను కబ్జా చేస్తున్నారని మండలంలోని  సిద్దోటం, తీగలపల్లి గ్రామస్తులు  బుధవారం ఆందోళనకు దిగారు. తీగలపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్​ 172లో జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్​ కూతురు పేరిట ఉన్న భూమిలో ఫాంహౌస్​ పనులు నడుస్తున్నాయి. కాగా, తీగలపల్లి నుంచి సిద్దోటం గ్రామాలను కలిపే 33 ఫీట్ల నక్షా రోడ్డును కబ్జా చేసి ప్రహారీ గోడను నిర్మించారు. గత నెలలో తహసీల్దార్​కు ఫిర్యాదు  చేయగా, సర్వే చేయించి గోడను తొలగిస్తామని పనులను నిలిపేశారు. 

ఆ తరువాత పనులు చేస్తుండడంతో గ్రామస్తులు, రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న​ఆర్ఐ కిరణ్​కుమార్, సర్వేయర్​ బంగారప్ప అక్కడికి చేరుకుని సర్వే చేసి కబ్జా చేసిన స్థలం రోడ్డుదేనని తేల్చారు. ఇదిలాఉంటే స్థలాన్ని వదిలేది లేదని ఏం చేస్కుంటారో చేసుకోండని కబ్జాదారుడు అధికారులకు వార్నింగ్​ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డును కబ్జా చేస్తున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కంచెను తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.