జర్మనీలోని అత్యంత ప్రముఖ డ్రెస్డన్ మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. కొన్న వందల ఏళ్లనాటి విలువైన వజ్రాలు, నగలను కూడా దొంగలు దోచుకెళ్లారు.వీటి విలువ దాదాపు రూ.7,800 కోట్లు ఉంటుందని అంచనా. దోపిడీ చేసిన దొంగలు ఆడీ కారులో పరారయ్యారు. జర్మనీ మ్యాజియం చరిత్రలో ఇదే అతిపెద్ద చోరీ.
నిన్న(సోమవారం) జరిగిన ఈ భారీ దోపిడీ యూరప్ దేశాల్లో సంచలనం సృష్టించింది. మ్యూజియంలోని గ్రీన్ వాలెట్ భవనంలో ఈ చోరీ జరిగింది. ఈ భవనానికి అత్యంత కట్టుదిట్టమైన ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థ ఉంది. సమీపంలో ఉన్న అగస్టీన్ వంతెన కింద నుంచి ఈ భవనానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు… వంతెన కింద ఉన్న విద్యుత్ సరఫరాను కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత… గ్రీన్ వాలెట్ భవనంలోకి ప్రవేశించారు. బరువైన, పెద్ద వస్తువులు కాకుండా… చిన్న సైజులో ఉన్న అత్యంత విలువైన వజ్రాలు, ఖరీదైన నగలను మాత్రమే దోచుకెళ్లారు. అలారం మోగడంతో అలర్టైన పోలీసులు మ్యూజియం నుంచి వెళ్లే దారి మొత్తాన్ని మూసేశారు. అయితే అప్పటికే ఆ దోపిడీ దొంగలు ఎవరికీ దొరక్కుండా తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

