కామారెడ్డి జిల్లాలో దోపిడీలు.. దొంగతనాలు .. ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలు

  • దారి దోపిడీకి పాల్పడుతున్న దుండగులు
  • కామారెడ్డిలో వరుస దొంగతనాలు 
  •  సీసీ కెమెరాలు ఉన్నా దొరకని దొంగలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల దొంగలలు హాల్​చల్​ చేస్తున్నారు.  దారికాచి దోచుకుంటున్నారు. ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుశాఖ నిరంతరం సీసీ కెమెరాలు, సిబ్బందితో పర్యవేక్షిస్తున్నా జిల్లా కేంద్రంలోనే వరుసగా చోరీలు జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నిఘా వైఫల్యంతోనే  వరుస దొంగతనాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జిల్లా పోలీసు ఆఫీసు, పోలీసు ఆఫీసర్లు నివసిస్తున్న ఏరియాకు  దగ్గరలోనే  చైన్​స్నాచింగ్​లు జరుగుతుండటం గమన్హారం.   

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రం మీదుగా హైవే, రైల్వే లైన్​ఉంది.  సికింద్రాబాద్ నుంచి మహారాష్ర్టలోని ముంబై, నాందేడ్​ వైపు రైళ్లు రాకపోకలు ఎక్కువ.  రైల్వే, హైవేతో  జిల్లా కేంద్రం గుండా ఇతర రాష్ట్రాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారు. మహారాష్ర్టతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చోరీలు చేసి పారిపోతున్నారని  పోలీసు ఆఫీసర్లు చెబుతున్నారు.  మూడు నెలల వ్యవధిలో కామారెడ్డి టౌన్, దేవునిపల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో  దొంగతనాలు, చైన్​ స్నాచింగ్​లు, దారి దోపిడీలు జరిగాయి. 

సీసీ కెమెరాల నిర్వహణ అధ్వానం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసు శాఖ, స్థానికుల సహకారంతో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతకముందు మరో150 ఉన్నాయి.  కాలనీల్లోనూ  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.  నిర్వహణ లేకపోవడంతో కొన్నిచోట్ల అవి పనిచేయడంలేదు. పర్యవేక్షణ కూడా కరువైంది.  మెయిన్​ రోడ్ల వెంట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను టౌన్​ పోలీస్​ స్టేషన్,  జిల్లా పోలీసు ఆఫీసులోని కమాండ్​ కంట్రోల్​కు అనుసంధానం​ చేశారు.  రోడ్లపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై నిఘా ఉంచడానికి,  ఏదైనా ఘటన, దొంగతనాలు జరిగితే నిందితులను గుర్తించటానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.    

Also Read :- గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

ఇటీవల జరిగిన నేర ఘటనలు

  •  కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్​కు చెందిన  కుంబాలరాజు, సౌమ్య దంపతులు ఈ నెల 4తేదీ  రాత్రి  కామారెడ్డి టౌన్​నుంచి స్వగ్రామం వెళ్తున్నారు.  రైల్వే గేట్​ దాటి జయశంకర్​ కాలనీకి దగ్గరలో  బైక్​పై ముగ్గురు  వ్యక్తులు వెంబడించి మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు.
  • 3 నెలల క్రితం  కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అడ్లూర్​ రోడ్డులో వాకింగ్ చేస్తున్నాడు.  జయశంకర్​ కాలనీకి సమీపంలో  ఓ వ్యక్తి బెదిరించి అతడి బంగారపు ఉంగరం ఎత్తుకెళ్లారు.  
  • పది రోజుల క్రితం ఓ వ్యక్తి  కామారెడ్డి రైల్వే స్టేషన్​పుట్​ఓవర్​ బ్రిడ్జిపై నుంచి  వివేకానంద కాలనీ వెళ్తున్నాడు.  అక్కడే కాపు కాచిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు కత్తితో బెదిరించి బ్యాగ్​లో ఉన్న రూ.20 వేలు ఎత్తుకెళ్లారు.  బాధితుడు తెరుకునే లోపు అప్పుడే స్టేషన్​లోకి వచ్చిన రైలు ఎక్కి 
  • పారిపోయారు. 
  • ఈ నెల 24న అర్ధరాత్రి  అశోక్​నగర్​ కాలనీలోని మూడు ఇండ్ల తాళాలు పగులగొట్టి  తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి వస్తువులు, రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు.
  • పంచముఖి హనుమాన్​ కాలనీలో యోగేష్ అన వ్యక్తి​తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. అతడి  తాళాలు పగుల గొట్టి 37 తులాల బంగారు నగలు అపహరించారు. 
  • కొద్ది రోజుల క్రితం శ్రీరాంనగర్​ కాలనీలోని ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చే సరికి చోరీ జరిగింది. 4 తులాల బంగారు నగలు, 25 తులాల వెండి వస్తువులు దొంగిలించారు. 
  • నెల క్రితం స్నేహపూరి కాలనీ, వివేకానందకాలనీ, శ్రీరాంనగర్​కాలనీలోని  నాలుగు ఇండ్ల తాళాలు పగుల గొట్టి చోరికి పాల్పడ్డారు. 
  • ఈనెల 23న దేవునిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో పట్టపగలు ఇంటి తాళం పగుల గొట్టి  తులంన్నర బంగారు నగలు, కొన్ని వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు.

ప్రత్యేక టీమ్స్​ ఏర్పాటు చేశాం

టౌన్​లో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం.  ఇటీవల చోరీలకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టాం.   పక్క స్టేట్ నుంచి రైలులో వచ్చి చోరీ చేసి పారిపోతున్నారు.  కొత్త వ్యక్తులు కావటంతో వెంటనే సీసీ కెమెరాల ద్వారా వీరి ఆచూకీ లభించటం లేదు.   అయినప్పటికీ  వారిని త్వరలోనే పట్టుకుంటాం. చోరీలు జరగకుండా పెట్రోలింగ్​ ముమ్మరం చేశాం.  

చంద్రశేఖర్​రెడ్డి, కామారెడ్డి టౌన్​ సీఐ