వైన్స్లో అన్ని మందు బాటిల్స్ చూసేసరికి నోరు లబలబలాడింది.. దొంగ దొరికిపోయిండు..!

మెదక్: మద్యం షాపులో దొంగతనానికి వెళ్లిన దొంగ ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయాడు. నార్సింగిలోని కనకదుర్గ వైన్స్లో ఈ వింత ఘటన వెలుగుచూసింది. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి వైన్స్ యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. షాపు కట్టేశాక.. దొంగతనానికి వెళ్లిన దొంగ కౌంటర్లో ఉన్న నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు.

వైన్స్లో అన్ని మందు బాటిల్స్ చూసి నోరు లబలబలాడిందో.. ఏంటో గానీ.. ఒక బాటిల్ తీసుకుని తాగేశాడు. దొంగతనం ముగించుకుని వెళ్లే ముందు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయాడు. సోమవారం రోజూలానే షాపు తెరిచిన యజమాని వైన్ షాపులో నిద్రపోయి ఉన్న దొంగను చూసి షాకయ్యాడు. యజమానితో పాటు కొందరు కలిసి దొంగకు దేహశుద్ధి చేశారు. అప్పటికీ ఈ దొంగ మత్తులోనే ఉండిపోయాడు.

ALSO READ | విషమంగానే శ్రీతేజ్‌ పరిస్థితి.. రెండు రోజుల నుంచి మళ్లీ వెంటిలేటర్ పైనే..

మత్తులో ఉన్న దొంగపై దాడి చేయడంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వైన్స్ వద్దకు వచ్చి యజమానిని మందలించారు. తాగేసి స్పృహలో లేని వ్యక్తిపై దాడి చేయడంపై సీరియస్ అయ్యారు. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవద్దని, దొంగ గురించి తమకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వైన్స్ యజమానికి సూచించారు. దొంగ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి వైన్స్ లో దొంగతనానికి పాల్పడ్డాడనే విషయం అతను స్పృహలోకి వస్తే ఆరా తీయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.