విడాకులు ఇయ్యలేదనే నరికేశారు.. బోయిన్​పల్లిలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను బోయిన్​పల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి కత్తులు,  సర్జికల్ బ్లేడులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్​బోయిన్​పల్లిలోని హర్షవర్ధన్ కాలనీకి చెందిన మహ్మద్ సమీర్(21).. హస్మత్​ పేటకు చెందిన సదాఫా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి జనవరి 10న పెండ్లి చేసుకున్నారు. దీంతో సంప్రదాయ ప్రకారం మళ్లీ పెండ్లి చేస్తామని నమ్మించి యువతిని ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత కాలనీలో  తమ పరువు పోతుందని, విడాకులు ఇవ్వాలని కోరారు. అందుకు సమీర్​అంగీకరించకపోవడంతో హత్య చేయాలని ప్లాన్​ వేశారు. అందులో భాగంగానే యువతి తండ్రి మహ్మద్​షబ్బీర్​అహ్మద్(55), అన్నదమ్ములు మహ్మద్ ఓమర్​(25), అబ్దుల్ మతీన్​(25), రౌడీ షీటర్లు  పహాడీ షరీఫ్​కు చెందిన​ సయ్యద్​ సోహైల్​(25), బాలాపూర్​కు చెందిన షేక్​ అబ్దుల్ బాకర్​సిద్దీఖీ(29), ఇబ్రహీమ్​కలిసి రెండు వాహనాలపై  సమీర్​ఇంటికి ఆదివారం వచ్చారు. ఇంటి ముందు కూర్చున్న సమీర్​పై కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఇబ్రహీమ్ పరారీలో ఉన్నాడు.