వనపర్తి జిల్లాలో ఇష్టారీతిగా సెల్లార్లు

  • వనపర్తి జిల్లాలో అక్రమ నిర్మాణాలు
  • చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించినా పట్టించుకోని ఆఫీసర్లు

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇష్టారీతిగా సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సెల్లార్లు వెలిశాయి. జిల్లాలోని  మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల్లో సెల్లార్ల ఏర్పాటుకు పర్మిషన్లు లేవు. అనుమతులు లేకున్నా జీ ప్లస్​ వన్, జీ ప్లస్​ టూ, జీ ప్లస్​ త్రీ ఇలా బిల్డింగులు వెలుస్తున్నాయి. ఇలా వందల బిల్డింగులు వెలుస్తున్నా అడిగేవాడు లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆఫీసర్లు బిల్డింగుల పరిశీలనకు వచ్చినప్పుడు మేనేజ్​ చేసుకుంటూ నిర్మాణాలు కానిస్తున్నారనే విమర్శలున్నాయి. 

సెల్లార్లలో ఆసుపత్రులు, షాపులు

జిల్లా కేంద్రంలోనే 80 హాస్పిటళ్లు, షాపింగ్​ కాంప్లెక్సులు ఉన్నాయి. హాస్పిటళ్లలోని సెల్లార్లలో మెడికల్​ షాపులు, ల్యాబ్​లు, రోగులకు బెడ్​లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సెల్లార్లలో ఉండే రోగులు, వారి అటెండెంట్లు తిప్పలు పడాల్సి వస్తోంది. చికిత్స కోసం వచ్చిన వారు కొత్త రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కలెక్టర్​ ఆదర్శ్​ సురభి జిల్లా కేంద్రంలోని పలు హాస్పిటళ్లను సందర్శించినప్పడు సెల్లార్లలో ల్యాబ్​లు, మందుల షాపులు, రోగులను బెడ్​లపై పడుకోబెట్టడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ను ఆదేశించారు.

కానీ, ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇదిలాఉంటే పలు బిల్డింగ్​ల్లో సెల్లార్లలోనూ షాపులను నిర్వహిస్తుండడంతో అక్కడికి వచ్చే వారు తమ వెహికల్స్​ పార్కింగ్​ చేసే విషయంలో పక్క షాపు వారితో మాటలు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా పోతున్నారు. హై వేను ఆనుకుని ఉన్న పెబ్బేరు, కొత్తకోట లాంటి పట్టణాల్లోనూ సెల్లార్లు వెలిశాయి. ఖిల్లాగణపురం, ఆత్మకూరు, గోపాల్​పేట, పెద్దమందడి, పాన్​గల్​ తదితర మండలకేంద్రాల్లోనూ సెల్లార్లు ఉన్నాయి.