దివాలా తీసిన ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ) జరుపుతోన్న విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేసేందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ టాప్ మేనేజ్‌మెంట్ అప్పులు తీసుకునే వారి నుంచి సకల సౌకర్యాలను పొందిందని ఎస్ఎఫ్ఐఓ తెలిపింది. త్వరగా రుణాలు పొందడానికి, రికవరీలు ఆలస్యంగా చేపట్టేందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ టాప్ బాస్‌లకు బారోవర్స్(అప్పు తీసుకున్న వారు) విదేశీ ట్రిప్‌లను, ప్రైవేట్ జెట్ ట్రావెల్స్‌ను, చాపర్ రైడ్స్‌ను, విదేశాల్లో ఇళ్లకు ఇంటీరియర్ డెకరేషన్ వంటి సకల సౌకర్యాలను అందించినట్టు తెలిపింది. రుణాల జారీలో పెద్ద మొత్తంలోనే అవకతవకలు జరిగినట్టు పేర్కొంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్సియల్ సర్వీసెస్(ఐఎఫ్‌ఐఎన్) సంస్థ అప్పులు తీసుకున్న వారి నుంచి టాప్ మేనేజ్‌మెంట్‌కు వ్యక్తిగత ప్రయోజనాలు బాగా వచ్చాయని ఎస్‌ఎఫ్‌ఐఓ బహిర్గతం చేసింది. ఐఎఫ్‌ఐఎన్ అనేది ఐఎల్‌ఎఫ్‌ఎస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ. శివ గ్రూప్ కంపెనీల డిబెంచర్లలో పెట్టుబడి పెట్టడం లేదా 15 రకాల లావాదేవీల కింద అడ్వాన్స్ రుణాలు ఇవ్వడంతో ఐఎఫ్‌ఐఎన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ 15 లావాదేవీల్లో కేవలం నాలుగు లావాదేవీలకు సంబంధించిన రుణాలు మాత్రమే తిరిగి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ–మెయిల్ డేటా ఆధారంగా విచారణ సంస్థ ఈ విషయాలను బహిర్గతం చేసింది. శివ గ్రూప్ ఛైర్మన్ సీ శివశంకరన్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు రవి పార్థసారథి, వైభవ్ కపూర్, హరి శంకరన్‌లకు ఆతిథ్యమిచ్చారని కూడా విచారణ ఏజెన్సీ గుర్తించింది. వీటిలో విదేశీ ప్రయాణాలు, ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్ రైడ్స్, రిసార్ట్స్ బుక్ చేయడం, బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఉన్న కొన్ని ఫ్లాట్లకు ఇంటీరియర్ డెకరేషన్స్‌ను ఆఫర్ చేయడం చేశారని తెలిపింది.
ఏబీజీ గ్రూప్‌కు కూడా ఎలాంటి ప్రొసీజర్స్ పాటించకుండానే ఐఎల్‌ఎఫ్‌ఎస్13 రుణాలను అందజేసినట్టు ఎస్‌ఎఫ్‌ఓ గుర్తించింది. వీటి విలువ సుమారు రూ.1,080 కోట్లుగా తన విచారణ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ రుణాల్లో ఏబీజీ గ్రూప్ ప్రమోటర్ రిషి అగర్వాల్ భార్య అనుపమ అగర్వాల్‌కు ఇచ్చిన రూ.29 కోట్ల పర్సనల్ లోన్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ రుణాలన్నింటిన్నీ ఐఎల్‌ఎఫ్‌ఎస్ టాప్ మేనేజ్‌మెంట్ అనుమతితోనే ఇచ్చినట్టు పేర్కొంది. ఈ రుణాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రాసెస్‌లను కూడా ఈ ఇన్‌ఫ్రాక్ట్చ్రర్ ఫైనాన్సియల్ కంపెనీ పాటించలేదని రిపోర్ట్‌లో వివరించింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్సియల్ సర్వీసెస్(ఐఎఫ్‌ఐఎన్) నుంచి తీసుకొన్న కొంత మనీని తమ అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారకుండా ఉండేందుకు ఏబీజీ గ్రూప్ వాడుకుందని ఎస్‌ఎఫ్‌ఐఓ తన రిపోర్ట్‌లో వెల్లడించినట్టు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.
