కరెంట్ లేదని కొవ్వొత్తి వెలిగించి పడుకుంది.. నిద్రలోనే సజీవ దహనం అయ్యింది

మేడ్చల్ జిల్లా శామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలిగించి పడుకోగా ప్రమాదవశాత్తు పడుకున్న బెడ్ షీట్ కు మంటలు అంటుకొని మహిళ సజీవ దహనం అయ్యింది. శామీర్ పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన ఉదారి భాగ్య( 40)  తన గదిలో క్యాండిల్ నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించి నిద్రలోనే  చనిపోయింది. 

భాగ్యకి ఇద్దరు సంతానం ఉండగా  కొడుకు కొన్ని నెలల క్రితం చెరువులో పడి చనిపోయాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. భర్త 15 రోజుల కూలి పని నిమిత్తం కరీంనగర్ వెళ్ళాడు. మంగళవారం రాత్రి భాగ్య మద్యం సేవించి పడుకుందని, నిద్రమత్తులో ఉండగా ప్రమాదం జరిగిందని  స్థానికులు తెలపారు. 

 కరెంట్ బిల్లు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేసినట్లు తెలిసింది. కరెంట్ లేక పోవడంతో క్యాండిల్ వెలిగించి పడుకుంది. మంటలు బెడ్ షీట్ కు అంటుకొని అదే విధంగా చీరకు అంటుకోవడంతో నిద్రలోనే దహనం అయ్యిందని చెబుతున్నారు. ఇంట్లో వేరే గదిలో భాగ్య మరిది, అతని భార్య ఉంటారు. కానీ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు.  

పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శామీర్ పేట పోలీసులు.