- ఆందోళన కారులను చెదరగొట్టిన పోలీసులు
శివ్వంపేట, వెలుగు: బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఫ్లెక్సీల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొట్లాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అజయ్, బాలకృష్ణ కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీని చింపారని ఆ పార్టీ నాయకులు వారిద్దరిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలిసి బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి తమ కార్యకర్తలను వదిలి పెట్టాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం పోలీస్ స్టేషన్ వద్దకు తరలి రాగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని చెదర గొట్టారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఫ్లెక్సీ ఎవరు చింపారో తెలియదని, అలాంటపుడు మా పార్టీ కార్యకర్తలపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను వదిలి పెట్టాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరు పార్టీల వారిని సముదాయించి గొడవ
సద్దుమణిగేలా చేశారు.