బొజ్జ గణపయ్య బొమ్మల్లో ఏదో మ్యాజిక్ ఉంది

బొజ్జ గణపయ్య బొమ్మల్లో ఏదో మ్యాజిక్ ఉంది

ఆమె ఒక డాక్టర్. కానీ ఖాళీ దొరికితే వినాయకుడి విగ్రహాలను జమ చేసే పనిలో ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి రకరకాల రూపాల్లో ఉన్న గణేశుడి బొమ్మలను కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంది. అలా ఇప్పటివరకూ మూడు వేల గణేశ్ బొమ్మలను కలెక్ట్ చేసింది.  ఎందుకనడిగితే.. ‘బొజ్జ గణపయ్య బొమ్మల్లో ఏదో మ్యాజిక్ ఉంది’ అంటోంది.

తిరుచ్చిలో ఆప్తమాలజిస్ట్‌‌‌‌గా పనిచేస్తున్న  శాంతి చిన్నప్పుడు ఎగ్జిబిషన్‌‌‌‌లో చిన్న గణేశ్ బొమ్మను కొనుక్కుంది. దాన్ని చూసినప్పుడల్లా ఆమెకు ఎంతో ఆనందంగా అనిపించేది. ‘గణేశుడికి ఎనిమిది అవతారాలు ఉంటాయ’ని, ‘మనుషుల్లో ఉండే ఎనిమిది దుర్గుణాలను పోగొట్టే శక్తి గణేశుడికి ఉంద’ని వాళ్ల అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. అలా  తెలియకుండానే ఆ బొమ్మతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. అప్పటి నుంచి యునిక్‌‌‌‌గా ఉండే గణేశుడి బొమ్మలను కలెక్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది.  

శాంతి ఇప్పటివరకూ మూడువేలకు పైగా గణేశుడి బొమ్మలను కలెక్ట్ చేసింది. ఇందులో కొబ్బరి చెక్క, వక్క, విలువైన రాళ్లు, మల్టీ కలర్డ్ స్టోన్స్ ఇలా రకరకాల మెటీరియల్స్‌‌‌‌తో చేసిన బొమ్మలున్నాయి. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన గణేశుడి బొమ్మలన్నీ ఈమె దగ్గర ఉంటాయి. ఇందులో వందేండ్ల నాటి  బొమ్మలు కూడా ఉన్నాయి. ఈమె దగ్గరున్న గణేశుడి కలెక్షన్‌‌‌‌ను చూడడానికి చాలామంది ఇంటికొస్తుంటారు.  బొమ్మలు కలెక్ట్ చేయడానికి శాంతి వాళ్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ సాయం తీసుకుంటుంది. అప్పుడప్పుడు కొన్ని టూర్స్‌‌‌‌కి వెళ్తుంటుంది. “బొజ్జ గణపయ్య విగ్రహాలు  అందంగా ఉంటాయి. నేను ప్రపంచం నలుమూలల నుంచి రకరకాల గణేశ్ బొమ్మలను కలెక్ట్ చేశా. ప్రతీ బొమ్మ నాకు కొత్తగానే కనిపిస్తుంది. వినాయకుడి రూపం చాలా ప్రత్యేకమైంది. అందులో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ వినాయకుడ్ని ఇష్టపడతారు. రిచ్, పూర్ అన్న తేడా లేకుండా అందరూ గణేశుడ్ని పూజిస్తారు. నేను నా భక్తిని ఇలా బొమ్మల కలెక్షన్ ద్వారా చూపిస్తున్నా” అంటోంది శాంతి.